TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. త్వరలో..

29 Jan, 2022 08:37 IST|Sakshi

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి

తిరుమల/తిరుపతి తుడా/చంద్రగిరి: తిరుమల శ్రీవారి భక్తులకు త్వరలోనే ఆఫ్‌లైన్‌ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కోవిడ్‌ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనతో తిరుపతిలో ఆఫ్‌లైన్‌ ద్వారా టోకెన్ల జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబర్‌ 25 నుంచి రద్దు చేశామని చైర్మన్‌ వివరించారు. ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ, అవి గ్రామీణ ప్రాంతంలో వున్న సామాన్య భక్తులకు అందడం లేదనే భావనలో టీటీడీ ఉందన్నారు.

ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్‌ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతుండటంతో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 15వ తేదీ వరకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు మాత్రమే జారీచేస్తున్నామని ఆయన తెలిపారు. శ్రీవేంకటేశ్వ రస్వామి దర్శనం కోసం ఫిబ్రవరికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను శుక్రవారం ఉదయం ఆన్‌లైన్‌లో విడుదల చేయగా భక్తులు నిమిషాల్లోనే బుక్‌ చేసుకున్నారు. ఫిబ్రవరి నెలలో రోజుకి 12,000 చొప్పున టికెట్లను విడుదల చేశారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి స్లాట్‌ సర్వదర్శనం  టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఫిబ్రవరి 15 వరకు రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లను విడుదల చేశారు. 

విశేష పర్వదినాల్లో వర్చువల్‌ సేవ 
శ్రీనివాస మంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముఖ్య పర్వదినాల్లో నిర్వహించే కల్యాణోత్సవాన్ని వర్చువల్‌ సేవగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.
 
సీఎం చేతులమీదుగా శ్రీనివాససేతు ప్రారంభం
తిరుపతి స్మార్ట్‌ సిటీలో భాగంగా నిర్మిస్తున్న శ్రీనివాససేతు ఫ్లైఓవర్‌ తొలిదశ నిర్మాణాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన శ్రీనివాససేతు ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు.  

మరిన్ని వార్తలు