YS Viveka Case: ఎంపీ అవినాశ్‌ జైలుపాలే మీ లక్ష్యమా?

14 Jun, 2023 04:30 IST|Sakshi

ఎందుకీ ఈగో క్లాషెస్‌?.. సునీతకు సుప్రీంకోర్టు ప్రశ్న 

ప్రతివాది మీ కజినే కదా?

వ్యక్తిగత వాదనలతో తొందర పడుతున్నారేమో!

అంత అత్యవసరం ఏముంది? వెకేషన్‌ బెంచ్‌కు ఎందుకు?

ఇప్పుడీ పిటిషన్‌ను కొట్టివేస్తే సీనియర్‌ న్యాయవాదికి ఇబ్బందే.. అరెస్టు, ఇంటరాగేషన్‌ సీబీఐ చూసుకుంటుంది

ఎప్పుడు, ఏం చేయాలో దర్యాప్తు సంస్థకు తెలుసు మీరెందుకు జోక్యం చేసుకుంటారు?

దర్యాప్తు పూర్తి చేసేందుకు ఇప్పటికే గడువు విధించారు

మేం జోక్యం చేసుకుంటే అంతా మారిపోతుంది

సీబీఐకి నోటీసులివ్వలేం.. విచారణ 19కి వాయిదా  

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్‌ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డిని జైలుపాలు చేయడమే మీ లక్ష్యమా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం నర్రెడ్డి సునీతను ప్రశ్నించింది. ఈ వ్యవహారం చూస్తుంటే ఈగో క్లాషెస్‌లా ఉందని వ్యాఖ్యా­నిం­చింది. తొందరపడి వ్యక్తిగత వాదనల ద్వారా నష్టపోతారేమో చూసుకోవాలని హితవు పలికింది. పిటిషనర్‌ సునీత విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను ఈ నెల 19వ­తేదీకి వాయిదా వేస్తూ అదనపు డాక్యుమెంట్లు అందచేసేందుకు అనుమతించింది.

ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ నర్రెడ్డి సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ అహ్సానుద్దీన్‌ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. అయితే సుప్రీం వెకేషన్‌ బెంచ్‌ సీనియర్‌ న్యాయవాదులను అనుమతించకపోవడంతో పిటిషనర్‌ సునీత తన వాదనలు తానే వినిపించడం ప్రారంభించారు. సీనియర్‌ న్యాయవాది సిద్దార్ధ లూత్రా ఆమెకు సహకరించేందుకు ధర్మాసనం అనుమతించింది.

తాను పిటిషనర్‌నని, తన తండ్రి హత్యకు గురయ్యారని సునీత చెబుతుండగా.. ఆ విషయాల్లోకి తాము వెళ్లడం లేదని, వెకేషన్‌లో ఎందుకు వచ్చారని ధర్మాసనం ప్రశ్నించింది. ‘ఈ కేసులో జూన్‌ 30 కల్లా దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఛార్జిషీట్‌  ముందే ఫైల్‌ చేయాల్సి ఉంది. ఏ – 8 (అవినాశ్‌) భారీ కుట్ర చేసిన ప్రధాన వ్యక్తుల్లో ఒకరు. సీబీఐ దర్యాప్తునకు సహకరించడంలేదు.

ముందస్తు బెయిలు పొందడం వల్ల కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ కుదరడం లేదు. ముందస్తు బెయిలు ఎందుకు ఇచ్చారో కారణాలు తెలియడం లేదు’’ అని సునీత పేర్కొన్నారు. ఈ సమయంలో జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ జోక్యం చేసుకుంటూ ‘దీంట్లో అంతగా అత్యవసరమైన పరిస్థితి ఏముంది? వెకేషన్‌ బెంచ్‌కు రావాల్సిన అవసరం ఉందా?’ అని ప్రశ్నించారు. 

సీబీఐ చూసుకుంటుంది..
‘ఒక వ్యక్తిని అరెస్టు చేయాలో లేదో దర్యాప్తు సంస్థ చూసుకుంటుంది. ఎవరిని, ఎప్పుడు అరెస్టు చేయాలో ఎవరిని కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ చేయాలో సీబీఐకు తెలుసు. విచారణకు సహకరిస్తున్నారా లేదా అనేది కూడా సీబీఐ  చూసుకుంటుంది. మీరెందుకు జోక్యం చేసుకుంటారు? ఈ కేసులో పలు సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయి. మీకెందుకు ఈగో క్లాషెస్‌? అతడిని (ఎంపీ అవినాశ్‌) జైలు పాలు చేయాలన్న లక్ష్యమా? ఆ విధంగా చూడొద్దు. ఈ తరహా ప్రొసీడింగ్స్‌ ఎందుకు?’’ అని జస్టిస్‌ అమానుల్లా వ్యాఖ్యానించారు. 

ఇప్పుడీ పిటిషన్‌ను కొట్టివేస్తే..
ఎంపీ అవినాశ్‌రెడ్డి ఇతర నిందితులతో కలసి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సునీత ఆరోపించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అవినాశ్‌రెడ్డి సీబీఐ దర్యాప్తునకు సహకరిస్తున్నప్పుడు కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ అవసరం ఏముందని ప్రశ్నించింది. ‘‘మీకో సలహా ఇస్తాం. మీరు వ్యక్తిగతంగా వాదిస్తున్నారు. చట్టంపై అవగాహన లేమితో వాదనలో అంతగా ప్రావీణ్యం లేకపోవచ్చు. మేం ఇప్పుడు ఈ పిటిషన్‌ను కొట్టివేస్తే సీనియర్‌ న్యాయవాదికి ఇబ్బంది అవుతుంది.

అందుకే సెలవుల తర్వాత విచారణ జాబితాలోకి చేరుస్తాం’’ అని సునీతనుద్దేశించి ధర్మాసనం పేర్కొంది. సీబీఐ దర్యాప్తు ఈ నెల 30 కల్లా పూర్తి కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని సీనియర్‌ న్యాయవాది సిద్ధార్ధ లూత్రా ఈ సమయంలో పేర్కొన్నారు. వాదనలకు సీనియర్‌ న్యాయవాదులను అనుమతించడం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ తమకు ఇబ్బంది కలగ చేయవద్దని ఈ సందర్భంగా ధర్మాసనం సూచించింది.

తాము ఇప్పుడు వాదనలకు అనుమతిస్తే మరో నలుగురు సీనియర్‌ న్యాయవాదులు తమను వక్షకు గురి చేశారని ఆరోపించే అవకాశం ఉందని పేర్కొంది. తాము అనుమతించకపోయినప్పటికీ మీరు వాదనలు చేస్తున్నారంటూ లూత్రాను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టులో మరో బెంచ్‌ నిర్దేశించిన డెడ్‌లైన్‌ను తాము మార్చలేమని స్పష్టం చేసింది. 

గడువు నిర్దేశించాక ఎలా మారుస్తాం?
సీబీఐకు నోటీసులిచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించాలని ధర్మాసనాన్ని సునీత కోరారు. అయితే ఇప్పటికే మరో బెంచ్‌ జూన్‌ 30వతేదీ అని గడువు నిర్దేశించిన తరువాత తాము ఎలా మారుస్తామని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకవేళ ఇప్పుడు తాము జోక్యం చేసుకుంటే మొత్తం అంతా మారిపోతుందని వ్యాఖ్యానించింది.

అయితే సీబీఐకి నోటీసులు ఇవ్వాలని సునీత మరోసారి అభ్యర్థించడంతో ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఎందుకు సీబీఐ రావాలని కోరుతున్నారు? రావాలో వద్దో సీబీఐ నిర్ణయించుకుంటుంది. ప్రతివాది సహకరించకుంటే, కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ అవసరమైతే, హైకోర్టు ఆదేశాలు సరి కాకుంటే సీబీఐ తనకు తానే వస్తుంది. అందుకే చెబుతున్నాం. జూలై 3న కోర్టుకు రండి. మీ న్యాయవాది వాదిస్తారు’ అని ధర్మాసనం సూచించింది. 

న్యాయవాది వాదించడమే సబబు..
హైకోర్టు ఆదేశాలు నిష్ప్రయోజనమని ఈ అంశానికి సంబంధించి మరో కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని సునీత పేర్కొనడంతో అందుకే తాము సెలవుల తర్వాత రావాలని సలహా ఇస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ప్రతివాది అవినాశ్‌ మీ కజినా? అని ధర్మాసనం పదేపదే సునీతను ప్రశ్నించగా... అవునని తన రెండో కజిన్‌ అని సునీత సమాధానమిచ్చారు.

అయితే పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదించడమే సబబని, ఇందులో సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా సునీత పిటిషన్‌ను బుధవారం విచారణ జాబితాలో చేర్చాలని, అడ్వొకేట్‌ ఆన్‌రికార్డ్స్‌ హాజరవుతారని లూత్రా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అయితే సీబీఐకి నోటీసులు ఇవ్వడంలో తాము జోక్యం చేసుకోబోమని, పిటిషనర్‌ విజ్ఞప్తి మేరకు ఈ నెల 19న విచారణ జాబితాలో చేర్చాలంటూ రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

మరిన్ని వార్తలు