టీడీపీ అల్లరిమూకల పైశాచికత్వం

22 May, 2023 04:09 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ నేత, ఆయన కుటుంబంపై కర్రలు, రాళ్లతో దాడి 

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

గంగవరం (చిత్తూరు జిల్లా): వైఎస్సార్‌సీపీ నేత, ఆయన కుటుంబసభ్యులపై టీడీపీ అల్లరిమూకలు దాడులకు తెగబడిన ఘటన చిత్తూరు జిల్లాలో శనివా­రం రాత్రి జరిగింది. ఘటనపై బాధితులు ఆదివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గంగవరం మండలంలోని మార్జేపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత, గ్రామ సచివాలయ కన్వినర్‌ చిన్నరెడ్డెప్ప కుటుంబ సభ్యులపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత శంకరప్ప కుటుంబ సభ్యులైన ఆ పార్టీ కార్యకర్తలు 20 మందికి పైగా దాడి చేశారు.

శనివారం జూనియర్‌ ఎన్టీఆర్‌ జన్మదినం సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కొంతమంది చిన్నరెడ్డెప్ప ఇంటి ముందు టపాసులు కాల్చడంతో పశువులు బెదిరాయి. దీంతో కాస్త పక్కన కాల్చుకోవాలని చిన్నరెడ్డెప్ప కోరాడు. దీంతో టీడీపీ కార్యకర్తలు ‘మాకు నువ్వేంది చెప్పేది.. టపాసులు ఇక్కడే పెడతాం’ అంటూ చిన్నరెడ్డెప్పపై దాడికి తెగబడ్డారు. టీడీపీ కార్యకర్తలు సునీల్, చరణ్, విశ్వేశ్వరయ్య, యువరాజు, భాను, బాలరాజు, అశోక్, అమ­ర్‌నాథరెడ్డి, కార్తీక్, మరికొంతమంది కలిసి చిన్నరెడ్డెప్ప, అతని భార్య సుభద్ర, తండ్రి శ్రీరాములు, తల్లి మునివెంకటమ్మ, సమీప బంధువులు రత్నారెడ్డి, యశ్వ­ంత్, చంద్రప్పపై దాడి చేశారు.

ఇంటిపై రాళ్లు విసరడంతో కిటికీలు, తలుపులు పగిలిపోగా కర్రలు, రాళ్లతో దాడి చేసి ఇంట్లో ఉన్నవారిని తీవ్రంగా గాయపరిచారు. క్షతగాత్రులు ప్రస్తుతం పలమనేరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, గతంలో టీడీపీ కార్యకర్త చరణ్‌ గ్రామంలోని ఓ యువతితో అస­భ్యంగా ప్రవర్తించడంతో చిన్నరెడ్డప్ప, యువతి బంధువులు చరణ్‌ను మందలించారు. దీంతో కక్షగట్టిన చరణ్‌.. యువతి అన్న­పై అప్పట్లో దాడి చేసి తీవ్రంగా గాయపరి­చాడు.

ఈ నేపథ్యంలో పాతకక్షలను మనసులో పెట్టుకుని ఉద్దేశపూర్వకంగానే చరణ్, ఇతర టీడీపీ కార్యకర్తలు తమపై దాడికి పాల్పడినట్లు బాధితులు చెప్పారు. టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి గ్రామానికి చేరుకుని ఘటనపై విచారించారు.  శంకరప్పతో సహా దాడికి పాల్పడిన వారందరిపై కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు