కూలీల ‘ఉపాధి’నీ అడ్డుకుంటున్నారు..

31 Aug, 2020 08:16 IST|Sakshi

అదనపు నిధులు కేటాయించకుండా కేంద్రానికి టీడీపీ తప్పుడు ఫిర్యాదులు

ఈ ఏడాదికి ఉపాధి హామీ పథకానికి 21 కోట్ల పని దినాలు కేటాయింపు

లాక్‌డౌన్‌ వేళ వలస కార్మికుల రాకతో పెద్దఎత్తున పనులు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం

ఒక్కో పేద కుటుంబానికి రూ. 20 వేల ‘ఉపాధి’ వేతనం కల్పన

ఐదు నెలల్లోనే 20.15 కోట్ల పని దినాల లక్ష్యం పూర్తి

అదనపు పని దినాల కోసం జూన్‌లోనే కేంద్రానికి లేఖ

టీడీపీ నేతల ఫిర్యాదులతో అదనపు కేటాయింపు నిర్ణయం వాయిదా

నేడు మరోసారి కేంద్ర, రాష్ట్ర అధికారుల సమావేశం

సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలోనూ గ్రామీణ పేదలకు ఆసరాగా నిలిచిన ఉపాధి హామీ పథకం పనులకూ ప్రతిపక్ష టీడీపీ మోకాలడ్డుతోంది. రాష్ట్రానికి అదనపు పని దినాలు రానివ్వకుండా చంద్రబాబు, టీడీపీ నేతలు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖకు  పెద్దఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 21 కోట్ల పని దినాలు కేటాయించి కూలీలకు పనులు కల్పించేందుకు అనుమతిచ్చింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో గ్రామీణ పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా పెద్ద ఎత్తున పనులు కల్పించింది. దీంతో ఐదు నెలల వ్యవధిలోనే 20.15 కోట్ల పని దినాల కల్పన లక్ష్యం పూర్తయింది. గ్రామాల్లో వ్యవసాయ పనులు మొదలైనా ప్రస్తుతం రోజూ కనీసం 6 లక్షల మంది పేదలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. రాష్ట్రానికి కేటాయించిన వాటిలో మిగిలిన 85 లక్షల పని దినాలు కూడా 10, 15 రోజుల్లో పూర్తి కానున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి అదనంగా పనిదినాల కేటాయింపు జరగకుండా టీడీపీ నేతలు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు.
అదనపు నిధుల కోసం జూన్‌లోనే..

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని పేదలకు అదనపు పని దినాలు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రభుత్వ ఆదేశాలతో జూన్‌ నెలలోనే కేంద్రానికి లేఖ రాశారు. 
అదనపు పనిదినాల కేటాయింపుపై చర్చించేందుకు జూలై 10న కేంద్ర, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖల అధికారుల సమావేశం జరగ్గా.. టీడీపీ నేతల తప్పుడు ఫిర్యాదులను సాకు చూపి అప్పట్లో కేంద్ర అధికారులు అదనపు పనిదినాల కేటాయింపును వాయిదా వేశారు.
రాష్ట్రానికి కేటాయించిన పని దినాలు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో సోమవారం (ఆగస్టు 31న) మరోసారి చర్చించేందుకు కేంద్ర, రాష్ట్ర అధికారుల సమావేశం జరగనుంది.

అప్పటి తప్పుడు పనుల నిధుల కోసం..
అయితే, 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ నిధులతో కాంట్రాక్టర్లు చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదంటూ చంద్రబాబు సహా టీడీపీ నేతలు కొంతకాలంగా రకరకాల పేర్లతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు రకరకాల పేర్లతో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 
నిబంధనల ప్రకారం ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్టర్లకు తావు ఉండదు. ఏ పనైనా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే జరగాలి. 
జరిగిన పనికి నేరుగా గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలకే ఉపాధి హామీ నిధులు మంజూరవుతాయి.
ఎన్నికల ముందు నిధులు లేకపోయినా గ్రామాల్లో టీడీపీ నేతలకు నామినేషన్‌ పద్ధతిపై అప్పటి ప్రభుత్వం పనులు అప్పగించింది.
కేవలం 8–9 నెలల మధ్య కాలంలో రూ.2,200 కోట్లు ఖర్చు పెట్టి 1.50 లక్షల చిన్నచిన్న పనులు చేసినట్టు అప్పటి టీడీపీ నేతలు బిల్లులు రికార్డు చేయించుకున్నారు. 
ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది.
ఉపాధి పనుల పేరుతో అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణ కావడం, పనుల సంఖ్య లక్షల్లో ఉండటం వల్ల అవినీతిని అంచనా వేయడానికి ప్రస్తుతం గ్రామాల్లో పనులవారీగా పరిశీలన జరుగుతోంది.   

మరిన్ని వార్తలు