కాలేజీ పేరుతో కాజేశారు

22 Jul, 2021 02:37 IST|Sakshi

టీడీపీ ప్రభుత్వ హయాంలో కుంభకోణం మరొకటి వెలుగులోకి..

మాన్సాస్‌ భూములు 150.09 ఎకరాలు కావాల్సిన వారికి కట్టబెట్టేశారు

మెడికల్‌ కాలేజీ కాదు కదా.. కనీసం మెడికల్‌ బోర్డుకు దరఖాస్తే చేయలేదు

కొత్తవలసలో ట్రస్టుకున్న 53.40 ఎకరాల్లో మిగిలింది 6.31 ఎకరాలే

రూ.118 కోట్ల విలువైన భూమి రూ.43.58 కోట్లకే అనుయాయులకు 

సాక్షి, అమరావతి: మెడికల్‌ కాలేజీ ముసుగులో టీడీపీ పెద్దలు వందల ఎకరాల మాన్సాస్‌ భూములను అమ్మేశారు. మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు కనీసం దరఖాస్తు కూడా చేయకపోగా ఆ పేరుతో విశాఖ నగరానికి సమీపంలో మాన్సాస్‌ ట్రస్టు పేరిట ఉన్న 150.09 ఎకరాలను, మరో 1,430 చదరపు గజాల వాణిజ్య భూమి కారుచౌకగా తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేయడం గమనార్హం. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే  ‘ముఖ్య’నేత ఈ భారీ మాయకు తెరతీస్తే మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌గా ఉన్న అశోక్‌ గజపతిరాజు తన వంతు సహాయ సహకారాలను అందజేశారు. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, మాన్సాన్‌ ట్రస్టులలో చోటు చేసుకున్న అక్రమాలపై దేవదాయ శాఖ ముగ్గురు ఉన్నతాధికారులతో ప్రాథమిక విచారణ జరిపి ప్రభుత్వానికి  నివేదిక అందచేయడం తెలిసిందే. విజయనగరంలో మెడికల్‌ కాలేజీ పేరుతో మాన్సాస్‌ ట్రస్టు భూముల విక్రయాల్లో జరిగిన అక్రమాలను నివేదికలో పేర్కొన్నారు. 

మన భూమి అయితే ఇలాగే అమ్ముతామా..?
భూమిని అమ్ముకుంటే ఎవరైనా సరే పూర్తి విస్తీర్ణం మేరకు లెక్కగట్టి డబ్బులు తీసుకుంటారు. ఆ స్థలంలో రోడ్లు వేసేందుకు కొంత భూమి కేటాయించాల్సి వస్తే అంతమేరకు తగ్గించుకుని డబ్బులు తీసుకుంటారా? ఒకవేళ అలా చేయాల్సి వస్తే ఇళ్ల ప్లాట్ల ధరకు తగట్టుగానే భూమి ధరను నిర్ణయించి విక్రయిస్తారు. కానీ మాన్సాన్‌ భూములు అమ్మిన తీరు చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మకమానవు. మెడికల్‌ కాలేజీ పేరుతో గత సర్కారు మాన్సాన్‌ భూములను నాలుగు ప్రాంతాల్లో విక్రయించింది. అందులో ఒకటి విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం కొత్తవలసలో భూముల అమ్మకం. అక్కడ ట్రస్టు పేరిట ఉన్న భూముల్లో 53.40 ఎకరాల అమ్మకానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా 43.40 ఎకరాల విక్రయానికి తెరతీశారు.

రోడ్లు వేయాలంటూ..
కొత్త వలసలో 43.40 ఎకరాల అమ్మకమన్నారు. అయితే కొనుగోలుదారులు అంతర్గతంగా 80 అడుగుల రోడ్లు ఏర్పాటు చేసుకుంటే 2.98 ఎకరాల భూమి వృధా అవుతుందంటూ దాన్ని విక్రయించే భూమి నుంచి ముందే మినహాయించారు. ఇక ఇళ్ల ప్లాట్లకు అనువుగా లేదంటూ మరో 4.31 ఎకరాలను మినహాయించారు. ఇలా మొత్తం 7.29 ఎకరాలను మినహాయించి మిగిలిన 36.11 ఎకరాలకు మాత్రమే కొనుగోలుదారుడి నుంచి డబ్బులు తీసుకున్నారు.

10.98 ఎకరాలు ఉచితంగా...
ఇదొక ఎత్తు కాగా ఈ భూములను అమ్మిన తర్వాత ట్రస్టుకు అక్కడ మరో పది ఎకరాల స్థలం ఉండాలి. అయితే ఇప్పుడు 6.31 ఎకరాలే మిగిలినట్లు అధికారుల కమిటీ నిర్ధారించింది. అంటే అక్కడ మరో 3.69 ఎకరాలు ఈ అమ్మకం లావాదేవీల తర్వాత కనిపించకుండా పోయింది. అంటే మొత్తంగా ట్రస్టుకు చెందిన 10.98 ఎకరాల భూమికి ఎటువంటి ప్రయోజనం పొందకుండా కొన్నవారికి ధారాధత్తం చేశారు. 

36.11 ఎకరాల్లో రూ.74 కోట్లు దోపిడీ..
మాన్సాన్‌ ట్రస్టు భూములను అమ్మిన కొత్తవలసలో రిజిస్ట్రేషన్‌ ధర ఎకరం రూ.89 లక్షలు ఉంది. అయితే ఆ భూమిని అమ్మే సమయంలో అక్కడ మార్కెట్‌ ధర ఎకరం రూ.2.51 కోట్లు ఉన్నట్లు దేవదాయ శాఖ అధికారులు నిర్ధారించారు. కానీ మార్కెట్‌ ధర కంటే సగం ధరకే ఎకరం రూ.1,20,70,000 చొప్పున విక్రయించారు. ఒకవైపు 10.98 ఎకరాల భూమిని కోల్పోతూ మరోవైపు మార్కెట్‌ కంటే సగం ధర తక్కువకు అమ్మేశారు. మెడికల్‌ కాలేజీ అంటూ మభ్యపెట్టి గత సర్కారు 150.09 ఎకరాల మాన్సాన్‌ ట్రస్టు భూములను అమ్మగా అందులో 36.11 ఎకరాల భూముల విక్రయంతో ట్రస్టుకు వచ్చింది రూ.43.58 కోట్లు అయితే నష్టపోయింది రూ.74.22 కోట్లకుపైనే ఉంటుందని దేవదాయ శాఖ అధికారుల కమిటీ నిర్ధారించింది. మొత్తం 150.09 ఎకరాల అమ్మకాల తీరును విశ్లేషిస్తే ఈ దోపీడీ రూ.250 కోట్లకు పైబడి ఉండవచ్చని తాజాగా భావిస్తున్నారు.

సింగిల్‌ బిడ్‌ టెండర్లతోనే అమ్మకం..
కొత్తవలస భూముల కొనుగోళ్లలో కేవలం ఒక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ మాత్రమే పాల్గొంది. భూములు అమ్మే సమయంలో ఏమాత్రం పారదర్శకంగా వ్యవహరించలేదు. బహిరంగ వేలం పాటకు సంబంధించిన నోటీసులను మాన్సాన్‌ ట్రస్టు కార్యాలయం, విజయనగరం మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయం, భూములను అమ్ముతున్న ప్రాంతం, కనీసం నోటీసు బోర్డులో కూడా ఉంచలేదు. తగిన ప్రచారం కల్పించి ఉంటే ఎక్కువ మంది బహిరంగ వేలంలో పాల్గొని ఆ భూములకు మంచి ధర పలికి ఉండేదని అధికారులు నిర్ధారించారు. దేవదాయ శాఖ భూములను విక్రయించాలంటే నిబంధనల ప్రకారం అవన్నీ పాటించాలి. గత ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన హైదరాబాద్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు ప్రయోజనం కల్పించేందుకు తూతూ మంత్రంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.

మరిన్ని వార్తలు