నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’

24 Apr, 2021 13:54 IST|Sakshi

టీడీపీ ఎమ్మెల్యే అడ్డగోలు సినిమా 

సర్కారీ స్థలంలో ఏకంగా రెండు థియేటర్లు 

ఎన్నో దశాబ్దాలుగా ఉన్న పోరంబోకు స్థలం

టీడీపీ ప్రభుత్వ హయాంలో 22ఏ నుంచి మినహాయింపు 

ఈ మేరకు అప్పట్లో ప్రత్యేకంగా జీవో విడుదల

తాజాగా రెవెన్యూ అధికారుల గ్రౌండ్‌ రిపోర్ట్‌తో వాస్తవాల వెలికితీత 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పెతకంశెట్టి గణవెంకటరెడ్డి నాయుడు ... అంటే అర్థం  కాలేదు కదా... అదేనండి గణబాబు... విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే.. టీడీపీ సీనియర్‌ నాయకుడు. ఏమిటీ ఇంకా గుర్తుకు రాలేదా.. అవును మరీ.. 2019 ఎన్నికల తర్వాత ఒకటిరెండు సార్లు తప్పించి.. పెద్దగా ఇంటి గడప దాటి బయటకు రాని ఎమ్మెల్యే ఈయన. ఇప్పుడీయన సంగతేమిటి అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.. పైకి సుతిమెత్తగా మాట్లాడే ఈయన అక్రమార్జన మాత్రం గణగణ మోగాల్సిందే. సర్కారీ స్థలంలో ఏకంగా సినిమా థియేటర్లు కట్టేసుకుని ఆనక కోర్టుకు వెళ్ళి.. ఎంచగ్గా ఆక్రమణ ‘చిత్రం’ నడిపించేస్తున్నారు ఈయనగారు.. పూర్తి ‘సినిమా’ చూడాలంటే ఈ కథనంలోకి రావాల్సిందే.

వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులను కాపాడుకోవడం, చేతనైతే పెంచుకోవాలనుకోవడం ఇవన్నీ సహజం.. ఎవరైనా అదే చేస్తుంటారు. కానీ ఎమ్మెల్యే గణబాబు రూటే సెపరేట్‌.. వారసత్వంగా వచ్చిన ఆక్రమిత స్థలాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చి గత టీడీపీ హయాంలో అప్పటి అధికారులపై ఒత్తిడి తెచ్చి.. 22ఏ(ప్రభుత్వ స్థలం) నుంచి బయటకు తీసుకువచ్చేలా జీవో(నెం 361) తెప్పించుకున్నారు. ఇటీవల రెవిన్యూ యంత్రాంగం పూర్తి స్థాయి పరిశీలిస్తే గణబాబు వారి ఆ ఘనకార్యం వెలుగులోకి వచ్చింది.

ఒకప్పుడు విశాఖ రూరల్‌ మండలం.. ఇప్పుడు గోపాలపట్నం మండలం.. గోపాలపట్నం రెవెన్యూ గ్రామం సింహాచలం రైల్వే స్టేషన్‌ సమీపంలో సర్వే నెంబర్‌ 27బై1లో 35.5సెంట్ల(సుమారు1726.67 చదరపు గజాల) ప్రభుత్వ స్థలంలో గణబాబు తాత అప్పలనాయుడు ఐదు దశాబ్దాల క్రితం ఓ సినిమా థియేటర్‌ నిర్మించారు. అప్పట్లో ఆ స్థలం గ్రామ కంఠంగా రెవెన్యూ రికార్డుల్లో పేర్కొన్నారు. తర్వాత కాలంలో ప్రభుత్వ డ్రై స్థలం (పోరంబోకు)గా రికార్డుల్లో చూపించారు. 1962లో సింహాచలం దేవస్థానం అధికారులు ఈ భూమికి సంబంధించి రైతు వారీ పట్టా ఇవ్వాల్సిందిగా అనకాపల్లి అసిస్టెంట్‌ సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌కు దరఖాస్తు చేశారు. ఇది పెండింగ్‌లో ఉండగానే.. ఈ భూమి మాదేనంటూ 2009లో జిల్లా పరిషత్‌ సీఈవో అప్పటి రూరల్‌ తహశీల్దార్‌కు లేఖ రాశారు. ఈ స్థలాన్ని ఆక్రమణ చెర నుంచి తప్పించాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఇలా ఆ భూమిపై వివాదాలు నడుస్తుండగానే గణబాబు కుటుంబం సదరు సినిమా థియేటర్‌ రూపు మార్చేసింది. నరసింహా, శ్రీ నరసింహా పేర్లతో రెండు  థియేటర్లు నిర్మించేసింది. మరోవైపు 2014లో ఆ ప్రాంత ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గణబాబు ఎన్నికయ్యారు. అప్పటికే రియల్‌ బూమ్‌ ఆకాశాన్నంటిన విశాఖలో  35.5సెంట్ల స్థలం విలువ కోట్లకు ఎగబాకింది.
 
గోపాలపట్నంలోని  నరసింహా, శ్రీ నరసింహా సినిమా థియేటర్లు..  

దీంతో సదరు భూమిని ఎలాగైనా పూర్తిగా హస్తగతం చేసుకోవాలని గణబాబు పక్కా స్కెచ్‌ వేశారు. టీడీపీ ప్రభుత్వమే కావడంతో 2015లో ఎమ్మెల్యే గిరీ ఉపయోగించి గ్రామ కంఠం నుంచి ఆ స్థలానికి మినహాయింపు పొందారు. ఈ మేరకు 2015 సెప్టెంబర్‌ 29న రెవిన్యూ శాఖ నుంచి జీవో కూడా విడుదలైంది. ఇక ఆ తర్వాత స్థలాన్ని 22ఏ నుంచి తొలగించాలని ఓ వైపు కోర్టులో దాఖలు చేస్తూనే మరోవైపు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే  2016 జనవరి 22న అప్పటి జిల్లా కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ ఆర్‌సి నంబర్‌ 3153బై2015ఈ.1 ప్రకారం ఆ స్థలం 22ఏలో నుంచి బయట పడింది. 

స్థలాన్ని మింగేందుకు సబ్‌ డివిజన్లు 
సదరు విలువైన పోరంబోకు స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు గణబాబు ఎన్నో మాయోపాయాలు ప్రయోగించారు. ఆ క్రమంలో ఆ భూమిని లెక్కకు మించిన సబ్‌ డివిజన్లుగా విభజించారు. మొదట్లో ఒకే ఒక  (27బై1) సర్వే నెంబర్‌ పేరిట ఉన్న స్థలాన్ని ఆ తర్వాత 27బై4, 27బై5, 27బై5పి, 27బై16పి, 27బై18 సర్వే నెంబర్లుగా రూపాంతం చేశారు. దీంతో భూమి స్థితి మారి.. 22ఏ నుంచి బయటపడేందుకు మార్గం సులువైంది. ఈ మేరకు అప్పట్లో అధికారులు ఆయనకు పూర్తిస్థాయిలో సహకరించారని స్పష్టమవుతోంది.

అధికారుల గ్రౌండ్‌ రిపోర్ట్‌తో బయటపడిన వాస్తవాలు 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన దరిమిలా ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను అధికారులు తిరిగి స్వాధీనం చేసుకుంటూ వస్తున్నారు. టీడీపీ హయాంలో అక్రమార్కుల పరమైన సర్కారీ స్థలాలను ఆక్రమణల చెర నుంచి విడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోట్లు విలువైన గణబాబు సినిమా థియేటర్ల స్థలంపై కూడా దృష్టిసారించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెలికితీసి జిల్లా అధికార యంత్రాంగానికి నివేదికనిచ్చారు.

చదవండి: గాజువాక మాజీ ఎమ్మెల్యే  పల్లా శ్రీనివాస్‌ భూ అక్రమాలు
ప్చ్‌.. ముహూర్తం బాగాలేదు.. ఈసారి ఇలా!  

మరిన్ని వార్తలు