Reproduction Of Sauropod Dinosaurs: తొలిసారిగా గుర్తించిన తెనాలి శాస్త్రవేత్త గుంటుపల్లి వీఆర్‌ ప్రసాద్‌

16 Jun, 2022 10:10 IST|Sakshi

సౌరోపాడ్‌ డైనోసార్ల పునరుత్పత్తిపై కొత్త అంశాలు వెలుగులోకి..

కోతి నుంచి మనిషి అవతరించాడని చెబుతారు..

అలాగే నేటి పక్షుల పూర్వీకులు నాటి రాకాసి బల్లులేనట..! 

సాక్షి, గుంటూరు: మాంసాహార రాకాసి బల్లుల (డైనోసార్లు) గ్రూపు నుంచి పక్షులు పరిణామం చెందాయనే భావన ఇప్పటి వరకు శాస్త్ర లోకంలో ఉంది. అయితే వాటి పునరుత్పత్తి గురించి ఎవరికీ పెద్దగా అవగాహన లేదు. ఈ నేపథ్యంలో తాజాగా సౌరోపాడ్‌ (వెజిటేరియన్‌) డైనోసార్లు, పక్షులకు పునరుత్పత్తి ప్రక్రియ దగ్గరగా ఉందని తేల్చారు. ఈ మేరకు సరీసృపాల స్వర్ణయుగంగా పేర్కొనే క్రిటేషియస్‌ యుగం (దాదాపు వంద మిలియన్‌ ఏళ్లకు పూర్వం) నాటి టైటనోసారిక్‌ డైనోసార్ల శిలాజీకరణం చెందిన గుడ్లను తెనాలికి చెందిన పాలీయాంథాలజీ శాస్త్రవేత్త డాక్టర్‌ గుంటుపల్లి వీఆర్‌ ప్రసాద్‌ కనిపెట్టారు. ఆయన పరిశోధన పత్రం జూన్‌ 7న నేచర్‌ గ్రూప్‌ జర్నల్‌ సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌లో ప్రచురితమైంది. 


టైటనోసారిక్‌ డైనోసార్ల గూడు

భారతదేశంలో విస్తృతంగా..
అతిపెద్ద జంతువుల్లో సౌరోపాడ్‌ కుటుంబానికి చెందిన డైనోసార్‌ ఒకటి. తీసుకునే ఆహారాన్ని బట్టి వీటిని వెజిటేరియన్స్‌గా భావిస్తారు. క్రిటేషియస్‌ యుగంలో ఇవి భారతదేశంలో విస్తృతంగా ఉండేవి. సరీసృపాల్లో పునరుత్పత్తి కోశంలో ఒకేచోట గుడ్లు వస్తాయి. గర్భాశయంలో గుడ్డు లోపల పొర, పైన పెంకు తయారవుతాయి. ఒకేసారి అన్ని గుడ్లు విడుదలవుతాయి. పక్షుల్లో ఇందుకు భిన్నం. పునరుత్పత్తి నాలుగు భాగాలుగా విభజితమై ఉంటుంది. గుడ్ల నుంచి పైన పెంకు తయారీ వరకు నాలుగు దశలుగా జరిగి గుడ్డు ఒకేసారి విడుదలవుతుంది. పక్షుల్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు, ఒత్తిడి ఫలితంగా ఒక్కోసారి గుడ్డు లోపల గుడ్లు తయారవుతుంటాయి.


గుడ్డు లోపల గుడ్డు

గుడ్డు లోపల గుడ్లు.. 
సరీసృపాలు అన్నింటిలానే ఆ జాతిలోని డైనోసార్లలోనూ పునరుత్పత్తి ఒకేలా ఉంటుందనే భావన సరికాదని ప్రొఫెసర్‌ గుంటుపల్లి వీఆర్‌ ప్రసాద్‌ తన పరిశోధనలో తేల్చారు. పక్షుల్లో ఉన్నట్టుగానే డైనోసార్లలోనూ పునరుత్పత్తి ఉందని చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లా పడ్లియాలో సౌరోపాడ్‌ డైనోసార్ల గూళ్లను, వాటిలో శిలాజీకరణం చెందిన లోపభూయిష్టమైన గుడ్లను ప్రొఫెసర్‌ ప్రసాద్‌ గుర్తించారు. పక్షుల గుడ్ల తరహాలో వీటిలో గుడ్డు లోపల గుడ్డును కనుగొన్నారు. సరీసృపాలు, పక్షుల గుడ్లలో ఎక్కువ పొరలు ఉండటం సహజమే అయి నా, గుడ్డు లోపల గుడ్లు ఉంటాయనేది శాస్త్ర ప్రపంచానికి ఇంత వరకు తెలియదని ఆయన ‘సాక్షి’కి వివరించారు.

పరిశోధనల అనంతరం ఈ శిలాజ అవశేషాలను పడ్లియా సమీపంలోని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ డైనోసార్‌ శిలాజ జాతీయ పార్కులో భద్రపరచినట్టు తెలిపారు. ఈ రకమైన పరిశోధన మనదేశంలో జరగడం ఇదే ప్రథమం. అందు లోనూ పరిశోధకుడు తెలుగు శాస్త్రవేత్త కావడం విశేషం. ఈ పరిశోధనలో ప్రొఫెసర్‌ ప్రసాద్‌తోపాటు యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీకి చెందిన పాలీయాంథాలజీ పరిశోధక విద్యార్థిని హర్ష ధిమాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన విశాల్‌వర్మ పాలుపంచుకున్నారు.  

మరిన్ని వార్తలు