హలో.. అవుటాఫ్‌ కవరేజ్.. వారికి ఇంకా మొబైల్‌ కవరేజ్‌కష్టాలు!

23 Feb, 2023 05:04 IST|Sakshi

దేశంలో ఇంకా 38,901 గ్రామాల్లో మొబైల్‌ కవరేజీ లేదు 

మారుమూల గ్రామాల్లో వాణిజ్యపరంగా ఆచరణీయం కానందునే..  

దేశంలో 6.44 లక్షల గ్రామాలుండగా 6.05 లక్షల గ్రామాలకు మొబైల్‌ కవరేజ్‌ 

ఏపీలో 2,971 మారుమూల గ్రామాలకు లేదు 

అత్యధికంగా ఒడిశాలో 6,592 గ్రామాలకు.. 

ఈ 4జీ మొబైల్‌ సేవల కోసం రూ.26,316 కోట్లతో ప్రాజెక్టు 

ఇటీవల పార్లమెంట్‌లో ప్రకటించిన కేంద్ర కమ్యునికేషన్‌ మంత్రిత్వ శాఖ     

సాక్షి, అమరావతి: దేశంలో 38,901 మారుమూల గ్రామాలకు ఇంకా మొబైల్‌ కవరేజ్‌ లేదని కేంద్ర కమ్యునికేషన్‌ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్‌లో వెల్లడించింది. వాణిజ్యపరంగా ఇది సాధ్యం కాకపోవడంతోపాటు జనాభా అక్కడక్కడ కొద్దికొద్దిగా ఉండడమే ఇందుకు కారణమని తెలిపింది.

దేశంలో మొత్తం 6,44,131 గ్రామాలుండగా 6,05,230 గ్రామాలకు మొబైల్‌ కవరేజ్‌ ఉందని, మిగతా 38,901 గ్రామాలకు లేదని వివరించింది. అత్యధికంగా ఒడిశా రాష్ట్రంలో 6,592 గ్రామాలకు.. ఆ తరువాత రాజస్థాన్‌లో 3,316 గ్రామాలకు మొబైల్‌ కవరేజ్‌ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 2,971 గ్రామాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.  

రూ.26,316 కోట్లతో ప్రాజెక్టు 
దేశవ్యాప్తంగా మొబైల్‌ కవరేజీ లేని గ్రామాల్లో 4జి మొబైల్‌ సేవలను దశల వారీగా సంతృప్త స్థాయిలో కల్పించడానికి రూ.26,316 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును రూపకల్పన చేసినట్లు కేంద్ర కమ్యునికేషన్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండో దశలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రూ.2,211 కోట్ల అంచనాతో ప్రాజెక్టును చేపడుతున్నట్లు వెల్లడించింది.

అలాగే, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతమున్న 2జీ టెక్నాలజీని రూ.2,425 కోట్ల అంచనా వ్యయంతో 4జీ టెక్నా­లజీ స్థాయికి పెంచనున్నామని పేర్కొంది. అంతేకాక.. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ సేవలను అందించడానికి రూ.3,673 కోట్ల వ్యయం అంచనాతో పథకాలను చేపడుతున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశాలోని 7,287 గ్రామాలకు.. అలా­గే, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని 502 గ్రామాలకు 4జీ మొబైల్‌ కనెక్టివిటీని అం­దించడానికి రూ.7,152 కోట్ల అంచనాతో ప్రాజెక్టును చేపడుతున్నట్లు కేంద్రం తెలిపింది.   

మరిన్ని వార్తలు