Ranganathaswamy Temple History: ‘టిప్పు సుల్తాన్‌  పిలిస్తే పలికిన... రంగనాథుడు!’

12 Jan, 2022 12:35 IST|Sakshi

సాక్షి, మద్దికెర (కర్నూలు): మండల పరిధిలోని పెరవలి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీరంగనాథుడు  పిలిస్తే పలికే దేవుడిగా నిత్యం పూజలందు కుంటున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు ఒకరోజు మాత్రమే మహా విష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటా రు. అయితే పెరవలి శ్రీరంగనాథుడు సతీసమేతంగా 365 రోజులు ఉత్తర ద్వార దర్శనం చేసుకునే భాగ్యం ఈ ఆలయ ప్రత్యేకత.

ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే వైకుంఠంలోని శ్రీమహావిష్ణువును దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందని ప్రతీతి. ఈ నెల 13 తేదీ గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం చేసుకోనున్నారు భక్తులు. అదేవిధంగా సాయంత్రం 5:30 గంటలకు గరుఢ వాహనంపై స్వామివారు శ్రీదేవి, భూదేవి సతీసమేతంగా గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ మల్లికార్జున, దేవాలయ కమిటీ చైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.   

ఆలయ చరిత్ర : స్వతహా వైకుంఠ ద్వారం కలిగిన ఈ ఆలయంలో రంగనాథస్వామి, శ్రీదేవి, భూదేవి సతీసమేతుడై పూజలందుకుంటూ నిత్యం ఉత్తరద్వార దర్శన మిస్తున్నారు. స్వామివారు ద్వాదశ అళ్వారులతో వెలిసిన వైష్ణవ క్షేత్రం.  తపమాచరించిన రుషుల దర్శనార్థం శ్రీ మన్నారాయణుడే కపిల మహర్షి అవతారమెత్తి ఇచ్చట సాల గ్రామం ఇచ్చట ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. తదుపరి విజయనగరరాజులు హరిహరరాయలు, బుక్కరాయలు క్రీ.శ. 1336–37 సంవత్సరంలో దేవాలయం నిర్మించడంతోపాటు ఆలయ నిర్వహణకు వెయ్యి ఎకరాల మాన్యం ఏర్పాటు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి.    

ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు : 
ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. అలాగే  ప్రతి ఏటా ఫల్గుణ శుద్ధ ద్వాదశి నుంచి బహుళ సప్తమి వరకు బ్రహోత్సవాలు జరుగుతాయి. కర్ణాటకలోని శ్రీరంగ పట్టణం రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్న టిప్పు సుల్తాన్‌ దండయాత్రలు చేసుకుంటూ ఒకరోజు ఇక్కడి వచ్చారని నానుడి. ఆలయాన్ని ధ్వంసం చేయబోయిన టిప్పు సుల్తాన్‌కు స్వామివారు శక్తిమంతుడని ప్రజలు చెప్పారట.

ఈ మేరకు స్వామివారిని పరీక్షించేందుకు ఆయన  శ్రీరంగనాథా అని పిలువగా ఓయ్‌ అంటూ పలికారని నానుడి. దీంతో టిప్పు సుల్తాన్‌ స్వామివారిని దర్శించుకుని తన అశ్వం ఎంతవరకు పరిగెడితే అంతవరకు స్వామివారికి భూమి ఇచ్చాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.    

మరిన్ని వార్తలు