బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

18 Sep, 2020 18:54 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శుక్రవారం వైభవంగా అంకురార్పణ జరిగింది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. అద్దాల మండపంలో పుట్టమన్ను సేకరించి శాస్త్రోక్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల అదనపు ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఈ సారి ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. గుడి ప్రాకారం లోపలే బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. టీటీడీ బోర్డు చరిత్రలో ఇలా ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రేపు (శనివారం) ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ నిర్వహించనున్నారు. ఈనెల 23న గరుడసేవ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. తిరుమల చేరుకుని శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.


ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు: సుబ్బారెడ్డి 
కోవిడ్ కారణంగా తిరుమల చరిత్రలోనే తొలిసారిగా ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ.. ‘ఈరోజు అంకురార్పణ ఘట్టం ముగిసింది. రేపు సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయి.. ఈనెల 27న చక్రస్నానంతో ముగుస్తాయి. శ్రీవారి భక్తులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. ఇతర ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశాం.

ఈనెల 23న సాయంత్రం గరుడ వాహనసేవకు ప్రభుత్వం తరపున శ్రీవారికి సీఎం వైఎస్‌ జగన్‌ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 23 నాడు సాయంత్రం 7 గంటలకు కర్ణాటక సీఎం యడియూరప్ప తిరుమల చేరుకుంటారు. 24వ తేదీ ఉదయం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరు శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం నాదనీరాజనం మండపంలో జరుగుతున్న సుందరకాండ పారాయణంలో ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు పాల్గొంటారు. తిరుమలలో కర్ణాటక సత్రం, యాత్రికుల వసతి సముదాయాలు శంకుస్థాపన కార్యక్రమంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పాల్గొంటార’ని సుబ్బారెడ్డి  తెలిపారు. 

మరిన్ని వార్తలు