ఎస్సీ మహిళలకు బస్‌ డ్రైవింగ్‌లో శిక్షణ

30 Jun, 2022 05:32 IST|Sakshi

మంత్రి మేరుగ నాగార్జున

సాక్షి, అమరావతి: ఆర్టీసీ ద్వారా ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. ఎస్సీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలపై వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శిక్షణ అనంతరం వారికి ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో డ్రైవర్లుగా అవకాశం కల్పిస్తామన్నారు.

కార్పొరేట్‌ ఆస్పత్రుల సౌజన్యంతో నర్సింగ్‌ కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తామని చెప్పారు. భారీ వాహనాల కొనుగోలు కోసం ఇచ్చే రుణ మొత్తాన్ని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ పథకం కింద విదేశాల్లో పీజీ చేసేవారికి రూ.20 లక్షలు, స్వదేశంలో పీజీ చేసే వారికి రూ.15 లక్షల వరకు రుణాలు అందిస్తామన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, డైరెక్టర్‌ కె.హర్షవర్ధన్, గురుకులాల కార్యదర్శి పావనమూర్తి, లిడ్‌క్యాప్‌ సీఎండీ డోలా శంకర్, ఎస్సీ కార్పొరేషన్‌ జీఎం కరుణకుమారి పాల్గొన్నారు.  

ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై అవగాహన 
అంతకుముందు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై మంత్రి మేరుగ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. దళితులు, గిరిజనులను వేధించకూడదని అగ్రవర్ణాల వారికి, తప్పుడు కేసులు పెట్టకూడదని ఎస్సీ, ఎస్టీలకు అవగాహన కల్పించాలన్నారు. తహశీల్దార్లు, ఎస్సైలు వారానికి ఓసారి గ్రామాల్లోకి వెళ్లి ప్రజల్ని చైతన్య పరచాలన్నారు.

ఈ చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో అతి తక్కువ శాతం నిందితులకు మాత్రమే శిక్షలు పడుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలు ఏర్పడినందున అన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కేసులను విచారించే డీఎస్పీలను నియమించాలన్నారు. ఈ సమావేశంలో సీఐడీ పీసీఆర్‌ ఎస్పీ రత్న, జేడీ ప్రాసిక్యూషన్‌ అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు