Sakshi News home page

13కు చేరిన మృతులు

Published Tue, Oct 31 2023 5:20 AM

Death toll in India train crash rises to 13 - Sakshi

ఆరిలోవ(విశాఖతూర్పు)/మహారాణిపేట (విశాఖ దక్షిణ)­/తాటిచెట్లపాలెం(విశాఖఉత్తర): విజయనగరం జిల్లా భీమాలి–ఆలమండ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కి చేరింది. మొత్తం 50 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో 34 మందిని విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించగా.. మిగిలిన వారిని విశాఖ కేజీహెచ్, రైల్వే, ఇతర ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించారు.

ఇదిలా ఉండగా, విశాఖ రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరిన పలాస ప్యాసింజర్‌లో స్పెషల్‌ గార్డుగా ఉన్న మరిపి శ్రీనివాసరావు(53) ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. విశాఖ ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతిచెందాడు. రైల్వే అధికారులు కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆయనకు తల్లితో పాటు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న భార్య అమల, పీజీ చదువుతున్న కుమార్తె హర్షప్రియ, బీటెక్‌ చదువుతున్న కుమారుడు చంద్రదీప్‌ ఉన్నారు.

మృతిచెందిన  లోకో పైలట్‌ మధుసూదనరావు(ఫైల్‌), మృతిచెందిన పలాస ప్యాసింజర్‌ గార్డు శ్రీనివాసరావు(ఫైల్‌) మృతిచెందిన లోకో పైలట్‌ మధుసూదనరావు(ఫైల్‌), మృతిచెందిన పలాస ప్యాసింజర్‌ గార్డు శ్రీనివాసరావు(ఫైల్‌) 

శ్రీనివాసరావుది పార్వతీపురం కాగా, ఉద్యోగ రీత్యా విశాఖలో స్థిరపడ్డారు. అలాగే, రాయగడ ప్యాసింజరుకు లోకో పైలట్‌గా ఉన్న విశాఖ జిల్లా తంగేడు గ్రామానికి చెందిన శింగంపల్లి మధుసూదనరావు(53) ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య సూర్యలత, ఇద్దరు కుమార్తెలున్నారు. ఉద్యోగరీత్యా మధుసూదనరావు కుటుంబం సహా విశాఖలో ఉంటున్నారు. 

విశాఖ కేజీహెచ్‌లో ఇద్దరికి శస్త్ర చికిత్స 
విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడ్డవారిలో నలుగురిని కేజీహెచ్‌కు తరలించగా.. వారిలో ఇద్దరికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన నల్ల కుమారి, విశాఖ జిల్లా గాజువాక దయాల్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ముర్రు లక్ష్మిలకు సోమవారం శస్త్ర చికిత్స నిర్వహించారు. నల్ల కుమారికి ఆర్థోపెడిక్‌ వార్డులో శస్త్ర చికిత్స అనంతరం ప్లాస్టిక్‌ సర్జరీ వార్డుకు తరలించినట్టు కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. లక్ష్మికి సాయంత్రం అత్యవసరంగా శస్త్ర చికిత్స చేశామన్నారు.

శ్రీకాకుళం జిల్లా సింగపురం గ్రామానికి చెందిన మోహిద వరలక్ష్మి, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం నడగాం గ్రామానికి చెందిన గొట్ట కమలమ్మలు చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా, రైలు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్సలు అందించడానికి, పోస్టుమార్టం నిర్వహించడానికి ముగ్గురు ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ వైద్యులను విజయనగరం పంపినట్లు ఆంధ్రా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.బుచ్చి­రాజు తెలిపారు. అలాగే ఆర్థోపెడిక్‌ వైద్యుడు భగవాన్‌ను క్షతగా­త్రులకు వైద్య సేవలు అందించడానికి విజయనగరం పంపినట్టు కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.అశోక్‌­కుమార్‌ చెప్పారు.

విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడినవారిలో 8మందిని విశాఖ తరలించారు. వీరిలో నలుగురు కేజీహెచ్‌లో, మరొకరు ఆరిలోవ హెల్త్‌ సిటీలో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురిని రైల్వే హాస్పిటల్లో చేర్పించారు. వీరిలో పలాస పాసింజర్‌ స్పెషల్‌ గార్డు మరిపి శ్రీనివాసరావు ఆదివారం రాత్రే మృతిచెందారు. మిగిలిన బి.తేజేశ్వర­రావు, పి.శ్రీనివాసరావు రైల్వే హాస్పిటల్లో చికిత్స పొందు­తున్నారు. వీరు కూడా రైల్వే ఇంజనీరింగ్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తు­న్నారు. వీరు ఆదివారం విధులు ముగించుకుని గోపాలపట్నం నుంచి పలాస రైలులో తమ సొంత ఊరు శ్రీకాకుళం వెళ్తూ ప్రమాదంలో గాయపడ్డారు. 

మృతుల వివరాలు 

1. కె.రవి (గొడికొమ్ము, జామి మండలం, విజయనగరం జిల్లా)
2. గిడిజాల లక్ష్మి (ఎస్‌పీ రామచంద్రాపురం, జి.సిగడం మండలం, శ్రీకాకుళం జిల్లా)
3. కరణం అప్పలనాయుడు (కాపుశంభాం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా)
4. చల్లా సతీష్‌ (తోటపాలెం, విజయనగరం)
5. శింగంపల్లి మధుసూదనరావు (లోకో పైలట్, ఎన్‌ఏడీ, విశాఖపట్నం)
6. చింతల కృష్ణమనాయుడు (గ్యాంగ్‌మన్, కొత్తవలస, విజయనగరం జిల్లా)
7. పిల్లా నాగరాజు (కాపుశంభాం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా)
8. మరిపి శ్రీనివాసరావు (పలాస ప్యాసింజర్‌ గార్డ్, ఆరిలోవ, విశాఖపట్నం)
9. టెంకల సుగుణమ్మ (మెట్టవలస, జి.సిగడం మండలం, శ్రీకాకుళం జిల్లా)
10. రెడ్డి సీతంనాయుడు (రెడ్డిపేట, చీపురుపల్లి మండలం, విజయనగరం జిల్లా)
11. మజ్జి రాము (గదబవలస, గరివిడి మండలం, విజయనగరం జిల్లా)
12. సువ్వారి చిరంజీవి (లోకో పైలట్, కుశాలపురం, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా)
13. ఒక మృతదేహం ఆచూకీ తెలియాల్సి ఉంది.  

రైలు ఒక్కసారిగా కుదుపునకు గురైంది..  
నేను విజయనగరం జిల్లా రాజాంలో తృతీయ సంవత్సరం ఇంజినీరింగ్‌ చదువుతున్నా. రెండు రోజుల సెలవులకు విశాఖ వచ్చి తిరుగు ప్రయాణంలో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం పలాస ట్రైన్‌ ఎక్కా. చీపురుపల్లిలో దిగాలి. ఆఖరి చివరి నుంచి రెండో బోగీలో ఉన్నాను. సాయంత్రం వేళలో రైలు ఒక్కసారిగా కుదుపునకు గురైంది. రైల్లోని లగేజ్‌ షెల్ఫ్‌లో ఉన్న సామాన్లు నాపై పడ్డాయి. దీంతో కంగారుపడ్డాను. ఒక్కసారిగా బోగీ 45 డిగ్రీల కోణంలో ఒరిగిపోయింది. నేను, నా స్నేహితుడు కలిసి బోగీలోని రాడ్లను పట్టుకుని బయటకు వచ్చేశాం.  – వి.అవినాష్, ఇంజినీరింగ్‌ విద్యార్థి, మునగపాక 

Advertisement

What’s your opinion

Advertisement