సీఎం జగన్‌ను కలిసిన త్రివేణి గ్లాస్‌ లిమిటెడ్‌ ఎండీ వరుణ్‌ గుప్తా

27 Feb, 2023 22:05 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: త్రివేణి గ్లాస్‌ లిమిటెడ్‌ ఎండీ వరుణ్‌ గుప్తా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలపై సీఎంతో చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వరుణ్‌ గుప్తాకు వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా పంగిడిలో రూ.1000 కోట్ల మూలధన పెట్టుబడితో రోజుకు 840 మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం కలిగిన సోలార్‌ గ్లాస్‌ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వరుణ్‌ గుప్తా ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్లాంట్‌ వల్ల రెండు వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సీఎం స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, ప్రభుత్వ సలహాదారు ఎస్‌.రాజీవ్‌ కృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు