'పోలవరం' పునరావాసం భేష్‌

30 Jul, 2021 04:13 IST|Sakshi
ఫైల్ ఫోటో

రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అనిల్‌కుమార్‌ ఝా అభినందన

వరదలతో గిరిజనులెవరూ ఇబ్బంది పడకుండా పునరావాసం కల్పించాలి.. వచ్చే నెలలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని వెల్లడి 

సాక్షి, అమరావతి:  పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన రీతిలో పునరావాసం కల్పిస్తోందని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అనిల్‌కుమార్‌ ఝా ప్రశంసించారు. పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి.. నాణ్యతతో ఇళ్లను నిర్మిస్తున్నారని అభినందించారు. గోదావరి వరదలవల్ల గిరిజనులు ఇబ్బంది పడకుండా పునరావాసం కల్పించాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు సహాయ పునరావాస (ఆర్‌అండ్‌ ఆర్‌) ప్యాకేజీ కింద పునరావాసం కల్పించడాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ‘మానిటరింగ్‌ కమిటీ’ని కేంద్రం ఏర్పాటుచేసింది. ఈ కమిటీ గురువారం అనిల్‌కుమార్‌ ఝా అధ్యక్షతన వర్చువల్‌ విధానంలో సమావేశమైంది.  

పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్, సభ్య కార్యదర్శి ఎన్‌కే శ్రీనివాస్, రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు, ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డి, సీఈ సుధాకర్‌బాబు, పోలవరం అడ్మినిస్ట్రేటర్‌   ఆనంద్‌ పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేసేలా పనులను వేగవంతం చేశామని శ్యామలరావు చెప్పారు. నిర్వాసితులకు వేగంగా ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పి అక్కడ మౌలిక సదుపాయాల కల్పన పనులను వర్చువల్‌ విధానంలో చూపించారు. వీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా ఐఏఎస్‌ అధికారిని నియమించాలని ఆదేశించారన్నారు. వాటిని పరిశీలించిన ఝా సంతృప్తి వ్యక్తంచేశారు. ఇళ్లను వేగంగా, నాణ్యంగా నిర్మిస్తున్నారని ప్రశంసించారు. ఈ సీజన్‌లో వరదలవల్ల నిర్వాసితులు, గిరిజనులు ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా పునరావాసం కల్పించాలని ఆదేశించారు. వచ్చే నెలలో పునరావాస కాలనీలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని చెప్పారు. వారి జీవనోపాధులను మెరుగుపర్చడంపై కూడా దృష్టి పెట్టాలని ఝా సూచించగా.. శ్యామలరావు స్పందిస్తూ.. ఆ మేరకు చర్యలు చేపట్టామన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు