'7 నెలలుగా దివ్య ఎంత క్షోభ అనుభవించిందో'

17 Oct, 2020 11:57 IST|Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన దివ్య తేజశ్విని కేసులో నాగేంద్రను ఎన్‌కౌంటర్‌ చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు దివ్య తల్లిదండ్రులు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 'దివ్యను నాగేంద్ర అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. దివ్య శరీరంపై 13 కత్తిపోట్లు ఉన్నాయి. నాగేంద్ర తనకు తానే చిన్న చిన్న గాయాలు చేసుకున్నాడు. ఇదంతా పథకం ప్రకారమే జరిగింది. హత్యానేరం నుంచి బయటపడేందుకే నాగేంద్ర మీడియాతో మాట్లాడుతున్నాడు.

పోలీసులకు వివరాలు చెప్పాం. దివ్య పెళ్లి ఇతర విషయాలు నిజం కాదు. ఏడు నెలలుగా మా బిడ్డ ఎంత క్షోభ అనుభవించిందో సెల్ఫీ వీడియో చూసేదాకా మాకు తెలీదు. సైకోలా వేధిస్తున్నాడని దివ్య వీడియోలో చెప్పింది. నా కూతర్ని అత్యంత కిరాతకంగా హింసించి, హత్య చేసిన నాగేంద్రను ఎన్‌కౌంటర్‌ చేయాలి' అని దివ్య తండ్రి జోసెఫ్‌ డిమాండ్‌ చేశారు.  (దివ్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు: ఆడియోలు లీక్‌)

పోలీసుల విచారణలో కొత్త విషయాలు
దివ్య తేజస్విని హత్య కేసులో పలు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. దివ్య, నాగేంద్ర వివాహంపై పోలీసుల విచారణలో ఎటువంటి అధికారిక ధ్రువీకరణ లభించలేదు. అయితే 2018 మార్చిలో మంగళగిరి పానకాలస్వామి ఆలయానికి దివ్య, నాగేంద్ర వెళ్లారు. అక్కడ వారికి వివాహమైనట్లు ఏ వివరాలు నమోదు కాలేదని పోలీసులు గుర్తించారు. నాగేంద్రకు సాయం చేసిన మహిళ కూపీ లాగేందకు పోలీసులు బృందం విష్ణు కాలేజీకి వెళ్లింది.

ఈ విషయంపై మరింత స్పష్టత కోసం నాగేంద్ర, దివ్య ఫోన్లలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మెసేజ్‌లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 28న చివరిసారిగా నాగేంద్రకు దివ్య కాల్‌ చేయగా.. ఏప్రిల్‌ 2న దివ్యకు నాగేంద్ర నుంచి చివరి కాల్‌ వచ్చినట్లు గుర్తించారు. కాగా ఈ కేసును బెజవాడ పోలీస్‌ స్టేషన్‌ నుంచి దిశ స్టేషన్‌కు బదిలీ చేశారు. 

పోయిన రక్తాన్ని మళ్లీ రీప్లేస్ చేశాం
జీజీహెచ్‌ సర్జికల్‌ వార్డులో నాగేంద్రబాబుకు చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా. ప్రభావతి అన్నారు. నాగేంద్ర బీపీ, పల్స్ సాధారణంగానే ఉన్నాయి. అతని అన్నవాహిక, పేగులకు గాయాలయ్యాయి. వాటిని సరి చేస్తూ వైద్యులు ఆపరేషన్ చేశారు. అయితే అతను సాధారణ స్థితికి రావడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పడుతుంది' అని ఆమె వెల్లడించారు. (అందుకే ఆమెను చంపి నేనూ చనిపోదామని..!)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు