హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా వరద నీరు.. 2 కి.మీ మేర ట్రాఫిక్ జామ్‌

27 Jul, 2023 19:20 IST|Sakshi

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: తెలుగు రాష్ట్రాలను వానలు వదలడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో  కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ ఇక్కడ అని కాకుండా దాదాపుగా అన్ని చోట్ల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్థంభించింది.  వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్‌ జిల్లాలో  మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామసమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై(హైదరాబాద్‌-విజయవాడ)అడుగు మేర వరద నీరు  చేరింది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వన్‌వేలోనే ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లిస్తున్నారు.

వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. కొందరు వాహనదారులు వరద నీటిలోనే తమ వాహనాలను ముందుకు నడిపిస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐతవరం వద్ద పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు.

కంచికచర్ల మండలం కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు వరద ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.  విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద ఈ మూడు నదులు కలిసి  ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయితే సమయం గడుస్తున్నా కొద్ది వరద మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఐతవరం దగ్గర పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో ముందస్తుగా టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. 
చదవండి: రెడ్‌ అలర్ట్.. మరో 24 గంటలు అతి భారీ వర్షాలు

మరిన్ని వార్తలు