Jeans Pollution: సముద్ర జలాల్లో ‘జీన్స్‌’ కాలుష్యం.. కేవలం ఏడుసార్లు వాడి పడేస్తున్నారు.. ఇలా అయితే కష్టమే!

21 Jan, 2023 05:02 IST|Sakshi

ఫ్యాషన్‌ ప్రపంచంలో ‘జీన్స్‌’కు ఉన్న క్రేజే వేరు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని ధరించడానికి ఎంతో ఇష్టపడతారు. అబ్బాయిలు, అమ్మాయిలు అయితే సరేసరి. పాశ్చాత్య దేశాల్లో వీటి హవా అంతాఇంతా కాదు. ఈ కారణంగానే ఏటా ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ల కంటే ఎక్కువ జతల జీన్స్‌ అమ్ముడవుతున్నాయి. ప్రతి సెకనుకు 73 యూనిట్ల విక్రయాలు జరుగుతున్నాయంటే మాటలు కాదు. మార్కెట్‌లో కొత్త పోకడలు, చౌక ధరల కారణంగా వీటి వినియోగం ఇంత ఎక్కువగా ఉంటోంది. అయితే, ప్రజల మనసులను దోచుకోవడంలోనే కాదు.. వాతావరణ కాలుష్యంలోనూ జీన్స్‌ పరిశ్రమ తీసిపోవడంలేదు.  

సాక్షి, అమరావతి:  జీన్స్‌ పరిశ్రమ కారణంగా మహా సముద్రాలు సైతం కలుషితమవుతున్నాయి. దాదాపు అర మిలియన్‌ టన్నుల మైక్రోఫైబర్లు (మూడు మిలియన్‌ బ్యారెళ్ల చమురుకు సమానం) ఏటా సముద్రాల్లోకి చేరుతున్నాయి. ఫలితంగా సాగర జలాలు విషపూరితంగా మారుతున్నాయి. ఇటీవల కాలంలో దుస్తుల్లో ఎక్కువగా వాడుతున్న సింథటిక్‌ పాలిస్టర్, నైలాన్, యాక్రిలిక్‌ (పాలిమర్‌ రంగులు)లను నీటిలో కడగడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇవి నీటిలో కుళ్లి నాశనం అవడానికి 200 ఏళ్లు పడుతుంది. దీనివల్ల జీన్స్‌లోని ప్లాస్టిక్‌ మైక్రోఫైబర్‌లు సముద్ర జలాలను కప్పేసినట్లు గుర్తించారు.

యూఎన్‌ నివేదికల ప్రకారం ఫ్యాషన్‌ పరిశ్రమ 20 శాతం కలుషిత నీరు, 10 శాతం కర్బన ఉద్గారాలను ఉత్పత్తి చేస్తోంది. ఇది విమానాలు, సముద్ర రవాణా ద్వారా వెలువడే ఉద్గారాల (గ్రీన్‌హౌస్‌ వాయువులు) కంటే ఎక్కువగా ఉంటోంది. దేశంలోని భారతియార్‌ విశ్వవిద్యాలయంలో టెక్స్‌టైల్స్, దుస్తుల డిజైన్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అముత కరుప్పచామి విశ్లేషణ ప్రకారం.. పత్తిని అధికంగా ఉత్పత్తి చేసే చైనా, భారత్‌తో పాటు, అమెరికాలో కూడా రసాయనాలను విరివిగా వినియోగించడం కూడా నీటి కాలుష్యాన్ని పెంచుతోందని చెబుతున్నారు.  

ఒక జత జీన్స్‌ తయారీకి 7,500 లీటర్ల నీరు 
సాధారణంగా.. దుస్తులన్నింటికీ అద్దకం, ఇతర ప్రక్రియల కోసం భారీగా మంచినీటిని ఉపయోగిస్తారు. ప్రతి టన్ను వ్రస్తానికి రంగు వేయడానికి దాదాపు 200 టన్నుల మంచినీరు అవసరం. ఇందులో ఒక జత బ్లూజీన్స్‌ తయారీకి 7,500 లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. ఇది సగటు వ్యక్తికి ఏడేళ్లపాటు అవసరమయ్యే తాగునీటితో సమానం. అలాగే, యూఎన్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రకారం ఫ్యాషన్‌ పరిశ్రమ ఏటా 93 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటిని ఉపయోగిస్తుంది. ఈ నీటితో ఐదు లక్షల మంది జీవితకాల దాహార్తిని తీర్చవచ్చు. మరోవైపు.. దుస్తుల వినియోగంలోనూ మానవుల్లో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది.  

కొద్దికాలానికే వాడిపడేస్తూ..: 
ప్రపంచవ్యాప్తంగా ఒక ఏడాదిలో 5,300 మిలియన్‌ టన్నుల నూలు తయారవుతోంది. దీంతో ఏటా 80 బిలియన్ల కొత్త దుస్తులు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే యూఎన్‌ ఎని్వరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ భాగస్వామి అయిన ఎల్లెన్‌ మకార్తుర్‌ ఫౌండేషన్‌ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు ఒక ట్రక్కులోడు వ్రస్తాలను చెత్తలో పడేస్తున్నారు లేదా కాల్చేస్తున్నారు. నిపుణుల అంచనా ప్రకారం గడిచిన దశాబ్దంలో దుస్తుల ఉత్పత్తి రెట్టింపు అయింది.

కానీ, వీటిలో 70 శాతం దుస్తులను ప్రజలు కొద్దిరోజులకే వాడిపడేస్తున్నారు. సగటున పాశ్చాత్య దేశాల్లో ఏడుసార్లు మాత్రమే ధరించి పడేస్తున్నారు. అదే ఇక్కడ ఒక కుటుంబం ఏటా 30 కిలోల దుస్తులను పడేస్తోంది. కొలరాడో పరిశోధన విశ్వవిద్యాలయం ప్రకారం.. కేవలం 15 శాతం దుస్తులను మాత్రమే రీసైకిల్‌ లేదా విరాళంగా అందిస్తున్నారు. ఇది మరింతగా పెరిగితే ఫ్యాషన్‌ పరిశ్రమ కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.  

స్లో అండ్‌ సస్టైనబుల్‌ ఫ్యాషన్‌.. 
కోవిడ్‌–19 తర్వాత  ప్రజల దృక్పథంలో మార్పువస్తోంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాషన్‌ పరిశ్రమ స్లో అండ్‌ సస్టైనబుల్‌ ఫ్యాషన్‌ ట్రెండ్‌ వైపు మళ్లుతోంది. ఇటువంటి సస్టైనబుల్‌ బ్రాండ్లు డజన్ల కొద్దీ మార్కెట్‌లోకి వచ్చాయి. ఇవి బట్టల తయారీకి ఆర్గానిక్‌ మెటీరియల్స్‌ను ఉపయోగిస్తున్నాయి. అయితే, ఇవి ఖరీదైనవిగా ఉన్నాయి. ఇందులో దుస్తులకు ఆర్గానిక్‌ రంగులనే వాడుతున్నారు. ప్రజల్లోనూ రీసైక్లింగ్‌ క్రేజ్‌ క్రమంగా పెరుగుతోంది. దుస్తుల్ని వివిధ దశల్లో చాలాసార్లు ఉపయోగించేలా అవగాహన వస్తోంది. 

మన దేశంలో ఇలా.. 
ఇక వివిధ మార్కెట్‌ అధ్యయనాల ప్రకారం భారతీయ డెనిమ్‌ (జీన్స్‌) మార్కెట్‌ కొన్నేళ్లుగా వార్షిక వృద్ధి రేటు సగటున 8–9 శాతం వరకు కొనసాగిస్తోంది. ఇది 2028 నాటికి రూ.91,894 కోట్లకు చేరుకుంటుందని అంచనా. మరోవైపు.. పాశ్చాత్య దేశాల మాదిరిగా కాకుండా, భారత్‌లో ప్రతి వ్యక్తికి సగటు జీన్స్‌ వినియోగం చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ప్రస్తుతం సగటున ఒక వ్యక్తికి 0.5 జీన్స్‌ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రతి వ్యక్తికి ఒక జత జీన్స్‌ ఉండాలంటే సంవత్సరానికి మరో 700 మిలియన్‌ జతల జీన్స్‌ అవసరమని అంచనా. అలాగే, ఓ సర్వే ప్రకారం 2023లో 59 శాతం మంది భారతీయులు గత సంవత్సరం కంటే ఎక్కువ జీన్స్‌ కొనుగోలు చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.   

>
మరిన్ని వార్తలు