సీనియర్‌ నేత పెనుమత్స కన్నుమూత

11 Aug, 2020 05:06 IST|Sakshi

అనారోగ్యంతో విశాఖలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో మృతి

సాక్షి ప్రతినిధి, విజయనగరం/నెల్లిమర్ల రూరల్‌/సాక్షి, అమరావతి: రాజకీయ కురువృద్ధుడు, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు (88) సోమవారం తుది శ్వాస విడిచారు. ఐదు నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని మనిషిగా పెనుమత్స గుర్తింపు పొందారు. 

సర్పంచ్‌ నుంచి మంత్రి వరకూ.. 
► విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మొయిదలో సాంబశివరాజు జన్మించారు. 
► 1957లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి మొయిద సర్పంచ్‌గా, రెండు సార్లు నెల్లిమర్ల బ్లాక్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 
► 1967, 1972లో గజపతినగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత సతివాడ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. నేదురుమల్లి జనార్దన రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు.
► వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ సమయంలో పార్టీలో చేరి అప్పటి నుంచి ఆ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడిగా కొనసాగారు.  

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు అధికారిక లాంఛనాలతో సాంబశివరాజు స్వగ్రామంలో అంత్యక్రియలను అధికారులు పూర్తిచేశారు. అంత్యక్రియల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ రఘువర్మ తదితరులు పాల్గొన్నారు. సాంబశివరాజు కుమారుడు డాక్టర్‌ సురేష్‌బాబును ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. 

ముఖ్యమంత్రి జగన్‌ సంతాపం 
సాంబశివరాజు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో మచ్చలేకుండా రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నేత సాంబశివరాజు అని సీఎం కొనియాడారు. ఆయన మరణం విజయనగరం జిల్లాతో పాటు, రాష్ట్రానికి తీరని లోటన్నారు. సాంబశివరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

ఎందరికో ఆదర్శప్రాయుడు: మంత్రి బొత్స
రాజకీయాల్లో తనదైన ముద్రవేసి ఎందరికో ఆదర్శప్రాయుడైన సాంబశివరాజు మృతి తీరనిలోటని ఓ ప్రకటనలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. సాంబశివరాజు కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. 

మరిన్ని వార్తలు