ప్రతిరోజూ..

14 Nov, 2023 01:26 IST|Sakshi

రాజంపేటటౌన్‌/మదనపల్లెసిటీ: కార్తీకమాసం ప్రారంభమైంది. ఏటా దీపావళి అమావాస్య ముగియగానే పాడ్యమి నుంచి కార్తీకం మొదలవుతుంది. ఈ ఏడాది దేవదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర మంతటా ఘనంగా కార్తీక ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

దేవదాయశాఖ ఆధ్వర్యంలో కార్తీక ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శంకర్‌ బాలాజీ ఆధ్వర్యంలో కసరత్తు ప్రారంభమైంది. ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలోని రైల్వేకోడూరులోగల శ్రీ భుజంగేశ్వరస్వామి ఆలయం, అత్తిరాల పరుశురామాలయం, సిద్దవటం మండలంలోని నిత్య పూజకోన, ఒంటిమిట్టలోని ముకుంద మల్లేశ్వరస్వా మి, పొలతల శ్రీ మల్లికార్జునస్వామి, కడప నగరంలోని శ్రీ మృత్యుంజయేశ్వరస్వామి, దేవునికడప శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం, అల్లాడుపల్లె, రాయచోటిలలోని వీరభద్రస్వామి ఆలయాలు, ప్రొద్దుటూరు శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో కార్తీక ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రతిరోజూ..

కార్తీక మాసోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉద యం అభిషేకాలు, అలంకారాలు, విశేష పూజలు, సర్వదర్శనం నిర్వహిస్తారు. ప్రత్యేకించి నాలుగు సోమ వారాల్లో ఆలయాలు భక్తులతో కళకళలాడనున్నాయి. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం లేదా మధ్యాహ్నం ఆయా ఆలయాలలో శివ కల్యా ణాలు నిర్వహించి రాత్రి జ్వాలా తోరణం కార్యక్రమాలు చేపట్టనున్నారు.

విస్తృత ఏర్పాట్లు

జనావాసాల మధ్యన ఉన్న దేవాలయాల్లోనే కాకుండా ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లోని శివాలయాల్లో ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్ల అభివృద్ధి, బారికేడ్ల ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణ, లైటింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. విద్యుత్‌ సరఫరాలో లోపాలను దృష్టిలో పెట్టుకుని జనరేటర్లను కూడా సిద్ధంగా ఉంచుతున్నారు. అన్నదానాలు నిర్వహించనున్నారు.

సజావుగా దర్శనాలు

అవసరమైన మేరకు ప్రొటోకాల్‌ పాటించినా దర్శనాలలో సాధారణ భక్తులకే తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నా మని దేవదాయశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం ఆయా ఆలయాల ఈఓలు, ఇన్‌స్పెక్టర్లను పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేశామన్నారు. పరిస్థితిని బట్టి వారు పోలీసు బందోబస్తును కోరవచ్చన్నారు. ఆలయాల వద్ద తాత్కాలిక వైద్య సదుపాయాలు కల్పించేందుకు వారు కృషి చేస్తారని,అవసరమైనచోట ముందుజాగ్రత్తగా ఫైరింజన్‌ సహకారం కూడా తీసుకోవాలని సూచించామన్నారు. మండల స్థాయిలో ఈఓలు, ఇతర ఎండో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

పారిశుధ్య చర్యలు

ఆలయాల వద్ద పారిశుధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నామని, భక్తులు కూడా ఈ విషయంగా తమకు సహకరించాలని దేవాదాయశాఖ అధికారులు కోరుతున్నారు. పొలతల, అల్లాడుపల్లె, నిత్యపూజకోనలోని కోనేర్లను శుభ్రం చేయాలని ఆదేశించామన్నా రు. ముఖ్యంగా భక్తులు కోనేటిలోనూ, ఆ బయట ప్లాస్టిక్‌ కాగితాలు, వ్యర్థాలు వేయవద్దని సూచించారు. నదీ తీరాలు, అటవీ ప్రాంతాల ఆలయాలకు వెళ్లే సమయంలో కుంటలు, వాగుల్లో ఈతకొట్టడం మంచిది కాదని, పిల్లలు, యువకులను ఈ విషయంలో జాగ్రత్తగా ఉండేలా పెద్దలు శ్రద్ధ చూపాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు