శ్వాసకోశ వ్యాధుల నియంత్రణకు చర్యలు

15 Nov, 2023 01:50 IST|Sakshi
న్యూమోనియా స్పెషల్‌ డ్రైవ్‌ను ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌ఓ కొండయ్య

రాయచోటి అర్బన్‌ : శ్వాసకోశ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొండయ్య అన్నారు. మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో న్యూమోనియా(శ్వాసకోశ వ్యాధుల) నియంత్రణకు సంబంధించిన స్పెషల్‌ డ్రైవ్‌ (సాన్స్‌ సర్వే)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి ఫిబ్రవరి 27 వరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. న్యూమోనియా వ్యాధి బారిన పడిన వారిలో జలుబు, దగ్గు అధికంగా ఉండడం, వెంట వెంటనే శ్వాసతీసుకోవడం, శ్వాస తీసుకోవడంలో పక్కటెముకలు కదలడం, అధిక జ్వరం, ఏమితినక పోవడం, తాగకపోవడం, నిద్రమత్తు, నీరసం తదితర లక్షణాలు కనిపిస్తాయన్నారు. ప్రత్యేక డ్రైవ్‌లో ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వే చేస్తూ పైలక్షణాలు ఐదేళ్లలోపు పిల్లలను గుర్తించి దగ్గరలోని ఆరోగ్య కేంద్రాలకు రెఫర్‌ చేయడం జరుగుతుందన్నారు. అవసరమైతే పెద్ద ఆసుపత్రులకు 108 అంబులెన్స్‌ల ద్వారా తరలించడం జరుగుతుందన్నారు. డీఐఓ ఉషశ్రీ మాట్లాడుతూ ఆరోగ్య, ఐసీడీఎస్‌ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైద్యశాఖ అధికారులు, సిబ్బందిలు పాల్గొన్నారు.

ఆరోగ్య సిబ్బందితో సమావేశం

రామాపురం : స్థానిక ఆరోగ్య కేంద్రంలో న్యూమోనియా ప్రత్యేక డ్రైవ్‌పై డీఎంహెచ్‌ఓ కొండయ్య ఆరోగ్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి జి.ఉష, లక్కిరెడ్డిపల్లె మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కర్ణపు విశ్వనాథరెడ్డి, జెడ్పీటీసీ వెంకటరమణ, వైద్యులు ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు