దుకాణంలో చోరీ

15 Nov, 2023 01:50 IST|Sakshi

నందలూరు (రాజంపేట): వరుస దొంగతనాలతో నందలూరు మండల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నిద్రిస్తున్న అవ్వ మెడలో బంగారు తాళి సరుడు లాక్కెళ్లారు అనే సంఘటన మరువక ముందే ఆలయాలను టార్గెట్‌ చేస్తున్నారు. నేడు ఏకంగా బస్టాండ్‌ కూడలిలోనే గంటపాటు ఓ దుకాణంలో తీరిగ్గా కూర్చొని చోరీ చేసిన సంఘటన సీసీ కెమెరాలలో కూడా నమోదు కావడం గమనార్హం. అసలు ఈ దొంగతనాలపై కేసులు నమోదవుతున్నాయా, దొంగలు దొరికేనా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక బస్టాండ్‌ కూడలిలోని పాకాటి చందు ఫ్యాన్సీ అండ్‌ జనరల్‌ స్టోర్‌కు చెందిన దుకాణంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. రూ.30 వేల విలువజేసే సిగరేట్‌ ప్యాకెట్లు, రూ.10 వేల విలువజేసే చాక్లెట్లు పోయినట్లు దుకాణం యజమాని తెలిపారు. మంగళవారం ఉదయం బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ అబ్దుల్‌ జహీర్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుకాణం ఎదురుగా ఉన్న ఓ ఆసుపత్రిలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అర్ధరాత్రి 12 గంటలకు దుకాణంలోకి వెళ్లిన దొంగ గంటపాటు అక్కడే ఉన్నట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అలాగే ఈ మధ్యకాలంలో ఒకే రోజు నాలుగు ఆలయాలలో చోరీలు జరిగాయి. అది మరువకముందే ఆల్విన్‌ కర్మాగారం సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం స్థానిక బస్టాండ్‌ కూడలిలో చోరి జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటికై నా రాత్రి వేళల్లో గట్టిబందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు