సామాజిక మాధ్యమాల్లో దూషణలకు పాల్పడితే చర్యలు

15 Nov, 2023 01:50 IST|Sakshi
మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు

రాయచోటి : సామాజిక మాధ్యమాలలో అసభ్యకరంగా, విద్వేషపూరితంగా, అవమానకరమైన పోస్టులను ప్రచురించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు హెచ్చరించారు. మంగళవారం అన్నమయ్య జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్వేష పూరిత పోస్టులు చేస్తున్న చింతా సుదర్శన్‌(32) అరెస్టుపై ఎస్పీ వివరించారు. జిల్లా పరిధిలోని పుల్లంపేట మండలం వత్తలూరు గ్రామానికి చెందిన చింత సుదర్శన్‌ టీడీపీ అనుచరులతో సంబంధాలు ఏర్పరచుకొన్నారన్నారు. ఇతను బి.ఫార్మసీ పట్టభద్రుడిగా పట్టా పొంది హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీలో పని చేస్తుండే వారన్నారు. అనారోగ్య కారణాల వల్ల గత ఏడాది నుంచి రాజంపేటలో ఉంటున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. టీడీపీ అనుచరులతో ఏర్పడిన సంబంధాల కారణంగా వాట్సాప్‌ గ్రూపులలో మెంబర్‌గా చేరి కంటెంట్‌ సమూహంలో భాగస్వామ్యం అయ్యారన్నారు. ప్రతి నెల టీడీపీ వారి నుంచి ఎనిమిది వేల రూపాయలు జీతం రూపంలో తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో నకిలీ పేర్లతో నకిలీ ఫేస్‌బుక్‌ ఐడీలు, ఈమెయిల్‌ ఐడీలను సృష్టించారన్నారు. వాటి ద్వారా దుర్వినియోగంగా ప్రేరేపించేలా సోషల్‌ మీడియా కంటెంట్‌ను ప్రచురించి ప్రసారం చేసేవాడన్నారు. సంస్థలు, రాజకీయ నేతలపైన అవమానకరమైన సందేశాలను పోస్ట్‌ చేయడానికి చిత్రలహరి పేరుతో ఫేస్‌బుక్‌ పేజీని సృష్టించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఫేస్‌బుక్‌ ద్వారా కమ్యూనిటీ ప్రమాణాలను ఉల్లంఘించినందున ఫేస్‌బుక్‌ పేజీకి రిపోర్ట్‌ చేసి బ్లాక్‌ చేయించామన్నారు. ఉద్యోగం ముసుగులో అమాయక యువతను గ్రూపులో చేర్చుకున్న వ్యక్తులను గుర్తించడానికి దర్యాప్తు శరవేగంగా జరుగుతోందని ఎస్పీ చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను గుర్తించుకోవాలని యువతకు సలహా ఇచ్చారు. యువత ఇలాంటి మోసపూరిత వారి మాటల్లో పడి మోసపోవద్దని ఎస్పీ ఉపదేశించారు. కెరీర్‌ భవిష్యత్తు అవకాశాలను ప్రభావితం చేసే చట్టపరమైన చర్యలతో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు