నరసరావుపేటలో బడుగుల వేడుక

21 Nov, 2023 05:44 IST|Sakshi
సభకు హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు  

ఘనంగా సామాజిక సాధికార బస్సు యాత్ర వేలాదిగా తరలివచ్చిన ప్రజలు

అడుగడుగునా నీరాజనాలు.. గజమాలతో ఘనస్వాగతం

సభలో సీఎం జగన్‌కు జేజేలు పలికిన వేలాది ప్రజలు

సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావు­పేటలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. బడుగు, బలహీన వర్గాలు వేడుక జరుపుకొ­న్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన చేయూతతో రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగు­తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సగర్వంగా సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో సోమవారం సాయంత్రం 4.45 గంటలకు లక్ష్మీతిరుపతమ్మ కాలనీ నుంచి ప్రారంభమైన యాత్ర పల్నాడు బస్టాండ్‌ సెంటర్‌ వరకు సాగింది.

ఈ యాత్రకు వేలాది మంది ప్రజలు.. మహిళలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. గజమాలతో స్వాగతం పలికారు. మత పెద్దలు యాత్ర విజయవంతానికి ప్రార్థనలు చేశా­రు. పల్నాడు బస్టాండ్‌ సెంటర్‌లో జరి­గిన సభలో పాల్గొన్న నేతలు ముందుగా జాతీ­య నేతలకు నివాళులర్పించారు. సభకు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు తరలివ­చ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళ­లకు సీఎం జగన్‌ చేసిన మేలును మంత్రులు, నేతలు వివరించారు. 

ఇది బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వం: మంత్రి సురేష్‌
గతంలో రాష్ట్రంలో పెత్తందార్ల పాలన సాగిందని, కానీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో బడుగువర్గాల ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రి ఆదిమూ­లపు సురేష్‌ తెలిపారు. నిజమైన సామాజిక సాధికారత ఫలితాలు ఎలా ఉంటాయో చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని చెప్పారు. బడుగువర్గాలకు చెందిన తనలాంటి ఎంతో మందిని మంత్రులుగా, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా చేసి చట్టసభల్లో సముచిత స్థానం కల్పించారన్నారు. గుర్రం జాషువా ఆశయాలు, ఆలోచనలను ఆచరణలో పెడుతున్న వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని అన్నారు. వందల కోట్లు ఖర్చు చేసి చంద్రబాబు బెయిల్‌ తెచ్చుకున్నారన్నారు. ఇక నుంచి కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడానికి వస్తాడని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

సామాజిక విప్లవాన్ని ఆచరణలో చూపిన సీఎం జగన్‌: మంత్రి నాగార్జున
దేశంలో ఎందరో మహనీయులు సామాజిక విప్ల­వం రావాలని, దేశం బాగుపడాలని, పేదవారు బాగుండాలని కోరుకున్నారని, కానీ దాన్ని ఆచర­ణలో చూపిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌ అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఒక్క సీఎం జగన్‌ మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను గుండెల్లో పెట్టుకున్నారన్నారు. చంద్రబాబు పాల­నలో ఎన్నో అవమానాలు, దాడులు ఎదుర్కొన్నా­మని చెప్పారు.

సీఎం జగన్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నార­న్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా రూ.2.40 లక్షల కోట్లు పేదలకు అందించారని తెలిపారు. పేదల పిల్లలకు ఇంగ్లిష్‌ విద్య అందిస్తున్నారని,  పేదవాడు ధైర్యంగా బతికేలా చూస్తు­న్నా­రని అన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని 11.1 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారంటే జీవన ప్రమాణాలు పెరిగాయో, తగ్గాయో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. 

జగనన్న చెప్పినవి, చెప్పనివి కూడా చేసి ప్రజల మన్ననలు పొందారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. 2019 ఎన్నికల్లో ఓటు వేయని ప్రతిపక్ష పార్టీల అభిమానులకు సైతం మేలు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ అని తెలిపారు. సామాజిక సాధికార సభలకు ఇన్ని వేల మంది వస్తుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి పచ్చమీడియా జనం లేరని అసత్య ప్రచారం చేస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ ఆగ్ర హం వ్యక్తం చేశారు.

అదే  పవన్‌ సభకు 10 మంది వస్తే 100 మంది వచ్చారని, చంద్రబాబుకు నలు గురు వస్తే 400 మంది అని చూపుతారని అన్నారు. సీఎం జగన్‌ పాలనలో పేదలకు సంక్షేమ ప«థకా­లతోపాటు విద్య, వైద్యం వంటి రంగాల్లో ఊహించని అభివృద్ధి జరిగిందని చెప్పారు.  ఈ కార్యక్రమంలో ఎంపీ విజయ­సాయిరెడ్డి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీలు కుంభా రవి, జంగా కృష్ణమూర్తి, మాజీ మంత్రి డొక్కా మాణి­క్యవరప్రసాద్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు