మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి

12 Nov, 2023 01:52 IST|Sakshi
ఆజాద్‌ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కోన రఘుపతి
● ఎమ్మెల్యే కోన రఘుపతి ● కలెక్టరేట్‌లో భారతరత్న అబుల్‌ కలాం జయంతి

బాపట్ల: దేశంలో విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి కార్యక్రమం బాపట్ల కలెక్టరేట్‌ ఆవరణలోని స్పందన సమావేశ మందిరంలో శనివారం జరిగింది. తొలుత కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అబుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ మౌలానా ఆజాద్‌ సేవలు నిరుపమానమన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో జాతి కోసం విశేషంగా కృషి చేశారన్నారు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. ఆయన జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. ఆయన చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించిందన్నారు. మౌలానా ఆజాద్‌ పేరిట ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని హైదరాబాదులో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత దేశం అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. బాపట్ల ఆర్డీఓ జి.రవీందర్‌, కలెక్టరేట్‌ ఏఓ కె.గోపికృష్ణ, వక్ఫ్‌బోర్డ్‌ కమిటీ అధ్యక్షుడు షేక్‌ జిలాని, ఉపాధ్యక్షుడు షేక్‌ ఇమామ్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు