వెలగాలి జ్ఞానదీపాలు

12 Nov, 2023 01:54 IST|Sakshi

తెలుగు పండుగల్లో చిన్నా–పెద్దా అందరికీ సంతోషదాయకమైన పర్వదినం దీపావళి. జీవుడి పాపాలను, నరక బాధను పోగొట్టే పెద్ద పండుగ ఇది. ‘తైలే లక్ష్మిః’ అని లక్ష్మీదేవి ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే నువ్వుల నూనెలో నివాసం చేస్తుందట. ఆ నువ్వుల నూనెతో ఆనాడు దీపాలు వెలిగించిన వారికి అలక్ష్మి పరిహారమై లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుందని చెబుతారు. అందుకే అందరి ఇళ్లముందు దీపాల వరుసలు పేర్చి పండుగను చేసుకుంటారు. పూజా కార్యక్రమంలో పెద్దలు ఉంటే చిన్నారులంతా పండుగును ఆస్వాదిస్తూ టపాసులు కాల్చుకుని ఆనందిస్తారు. అందుకే ‘చీకటి వెలుగుల రంగేళీ /జీవితమే ఒక దీపావళి / అందాల ప్రమిదల ఆనంద జ్యోతులు / ఆశలు వెలిగించు దీపాల వెల్లి’ అని సినిమా పాట. ఆ పదాలు ఇవాల్టికీ అందరికీ అన్వయమే అవుతున్నాయి. ఎందుకంటే ప్రతివ్యక్తి జీవితంలో చీకట్లు ఆవరించి ఉంటాయి. అందులో పయనిస్తూ.. మార్గం కనపడక.. భయంతో కొట్టుమిట్టాడుతున్న వారికి ఈ పండుగ గొప్ప మార్గనిర్దేశనం చేస్తుంది. అందుకే ప్రతిఏటా ఈ పర్వదినాన్ని సద్వినియోగించుకుని ఈ చీకట్లు తొలగించుకోమని దీపావళి పండుగ సారాంశం. అజ్ఞానపు చీకట్లలో నుంచి బయటపడి జ్ఞాన దీపాలు వెలిగించుకోమని చెబుతుంది. ఎందుకంటే చీకటి ఎప్పటికీ తానే గొప్ప అనుకుంటుంది. అయితే దీపం దాని అహాన్ని దెబ్బతీసి తలకిందులు చేస్తుందట. అందుకే ‘వైరాగ్య తైల సంపూర్ణే /భక్తివర్తి సమన్వితే / ప్రబోధ పూర్ణ పాత్రేతు/క్షిప్త దీపం విలోకయేత్‌’ అని పెద్దలమాట. అంటే నిండైన ప్రమిద ప్రబోధమైతే ఆ ప్రమిద వైరాగ్యమనే నూనెతో నింపి భక్తి అనే పత్తిని వేసి జ్ఞానమనే దీపాన్ని మనమందరమూ వెలిగించుకోవాలని. అంతెందుకు కాస్సేపు మన ఎదురుగా ఎర్రగా, నాజూగ్గా ఉన్నానుకుని చిటపటలాడే సీమ టపాసులకు ఉన్న బడాయినీ, నీటుగా, దీటుగా ఉన్నాననుకునే ఆటంబాంబుల దర్పాన్నీ ఓ చిన్న అగ్గిపుల్ల అణచివేస్తుంది. వాటిని తనకు బానిసలుగా చేసుకుని.. బూడిదగా మార్చి కాలగర్భంలో కలిసేలా చేస్తుంది. వాటిల్లోనే కాదు మనుషుల్లో ఈ అవలక్షణాలు ఉంటాయి. వాటికి దూరంగా ఉండమనే ఈ పర్వదిన సారాంశం. – గుంటూరు డెస్క్‌

మరిన్ని వార్తలు