వంద శాతం క్యాష్‌లెస్‌ హెల్త్‌ క్లెయిమ్‌ - ఐఆర్‌డీఏఐ

11 Sep, 2023 07:45 IST|Sakshi

బీమా కంపెనీలతో ఐఆర్‌డీఏఐ చర్చలు

ముంబై: పాలసీదారులు త్వరలోనే నూరు శాతం నగదు రహిత వైద్య సదుపాయం పొందేందుకు వీలుగా బీమా సంస్థలతో కలసి పనిచేస్తున్నట్టు బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ) ప్రకటించింది. నూరు శాతం క్యాష్‌లెస్‌ క్లెయిమ్‌ పరిష్కారాల కోసం బీమా సంస్థలు, నేషనల్‌ హెల్త్‌ అథారిటీ, బీమా కౌన్సిల్‌తో చర్చిస్తున్నట్టు ఐఆర్‌డీఏఐ చైర్మన్‌ దేవాశిష్‌ పాండా వెల్లడించారు. 

ముంబైలో జరుగుతున్న ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌లో భాగంగా ఆయన ఈ అంశంపై మాట్లాడారు. పాలసీదారులు నగదు రహిత చికిత్సలు పొందే విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పాండా దీన్ని ప్రస్తావించడం గమనార్హం. క్లెయిమ్‌ మొత్తంలో బీమా సంస్థలు నిబంధనల పేరుతో కొంత కోత పెడుతుండగా, కొన్ని క్లెయిమ్‌లను తిరస్కరించడం, రీయింబర్స్‌మెంట్‌ విధానంలో రావాలని కోరుతున్నాయి. 

నేషనల్‌ హెల్త్‌ ఎక్సే్ఛంజ్‌ పరిధిలోకి మరిన్ని హాస్పిటల్స్‌ చేర్చేందుకు కూడా ఇన్సూరెన్స్‌ కౌన్సిల్, నేషనల్‌ హెల్త్‌ అథారిటీతో సంప్రదింపులు చేస్తున్నట్టు పాండా తెలిపారు. వృద్ధులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీఇయం అందుబాటులో ఉండేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు