9 ఎయిర్‌పోర్టులు .. 50 శాతం వృద్ధి

29 Dec, 2022 06:07 IST|Sakshi

2022–23లో రూ. 9,650 కోట్లకు ఆదాయాలు

‘పీపీపీ’ విమానాశ్రయాలపై అంచనా

కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ నివేదిక

ముంబై: విమాన ప్రయాణీలకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన నడుస్తున్న తొమ్మిది ఎయిర్‌పోర్టులు ఈ ఆర్థిక సంవత్సరంలో 50 శాతం వృద్ధి సాధించనున్నాయి. వాటి ఆదాయాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ. 6,450 కోట్లుగా ఉండగా ఈసారి రూ. 9,650 కోట్లకు చేరనున్నాయి. క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ ఈసారి 70 శాతం వృద్ధి చెందనుంది. కరోనా పూర్వ స్థాయిలో 93 శాతానికి చేరనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది కోవిడ్‌ పూర్వ స్థాయికి 1.12 రెట్లు అధికంగా నమోదు కావచ్చని అంచనాలు ఉన్నాయి.

దేశీయంగా మొత్తం ప్యాసింజర్‌ ట్రాఫిక్‌లో 50 శాతం వాటా ఉన్న తొమ్మిది పీపీపీ విమానాశ్రయాల ఆర్థిక పరిస్థితిని మదింపు చేసిన మీదట ఈ అంచనాలకు వచ్చినట్లు కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ తెలిపింది. కోవిడ్‌ సమయంలో ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్లకు ఆదాయ పంపకంపరంగా ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఊరటనివ్వడంతో 2021–22లో వాటి స్థూల మార్జిన్లు మెరుగ్గా 56 శాతం స్థాయిలో నమోదయ్యాయి. అయితే, ఆదాయ పంపకాన్ని పునరుద్ధరించడంతో ఈసారి ఇవి 37 శాతానికి తగ్గనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కార్యకలాపాల స్థాయి పెరగడం వల్ల ఈ మార్జిన్లు సుమారు 45 శాతం వద్ద స్థిరపడవచ్చని కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ పేర్కొంది.  

ప్రైవేటీకరణలో మరింత జాప్యం..
విమానాశ్రయాల ప్రైవేటీకరణలోనూ, జాయింట్‌ వెంచర్‌ ఎయిర్‌పోర్టుల నుంచి తప్పుకోవాలన్న ప్రభుత్వ ప్రణాళికల అమల్లోనూ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ తెలిపింది. నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపీ) కింద 25 ఎయిర్‌పోర్టులను మానిటైజ్‌ చేయాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ ఆ దిశగా ఇంకా పటిష్టమైన చర్యలేమీ అమలవుతున్నట్లు లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో నిర్దిష్ట గడువులను మరింత ముందుకు జరపవచ్చని, కేంద్రం జోక్యం చేసుకోవాల్సి రావచ్చని నివేదిక అభిప్రాయపడింది.

భారత జీడీపీ వృద్ధి, విమాన ప్రయాణీకుల పెరుగుదలపై దాని ప్రభావం.. పని చేయగలిగే వయస్సు గల జనాభా సంఖ్య పెరుగుతుండటం తదితర అంశాలు భారతీయ ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్లకు సానుకూలంగా ఉండగలవని వివరించింది. సకాలంలో టారిఫ్‌ ఆర్డర్లను జారీ చేస్తూ నియంత్రణపరమైన పరిస్థితులను మెరుగుపర్చగలిగితే ఆపరేటర్లకు ఆదాయ అంచనాలపరంగా ఊరటగా ఉంటుందని నివేదిక పేర్కొంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ’లో బేస్‌ ఎఫెక్ట్‌’ కారణంగా 2023–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ వృద్ధి రేటు .. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుకన్నా 2.25 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ మౌలేష్‌ దేశాయ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు