తప్పుడు లక్ష్యంతోనే ఆ నివేదిక: అదానీ గ్రూప్‌ ఫైర్‌

28 Jun, 2023 07:35 IST|Sakshi

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ సుపరిపాలన, సమాచార వెల్లడిలో విశ్వసనీయ విధానాలు అవలంబిస్తున్నట్లు అదానీ గ్రూప్‌ తాజాగా పేర్కొంది. సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ గ్రూప్‌లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసినట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. యూఎస్‌ షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడిన ఐదు నెలల తదుపరి వార్షిక నివేదికలో ఇంకా పలు అంశాలపై స్పందించింది.

అదానీ గ్రూప్‌ కంపెనీలలో అక్రమాలు జరుగుతున్నట్లు ఈ ఏడాది జనవరి 24న హిండెన్‌బర్గ్‌ నివేదిక ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్‌లోని లిస్టెడ్‌ కంపెనీల షేర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఒక దశలో గ్రూప్‌ మార్కెట్‌ విలువలో 150 బిలియన్‌ డాలర్లమేర ఆవిరైంది. అయితే హిండెన్‌బర్గ్‌ నివేదిక తప్పుడు లక్ష్యాలతో నిరాధార ఆరోపణలకు తెరతీసిందని అదానీ గ్రూప్‌ కొట్టిపారేసింది.

ఇది దేశంపై జరిగిన దాడిగా గౌతమ్‌ అదానీ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున నివేదిక వెలువడినట్లు తెలియజేశారు. గ్రూప్‌పై తప్పుడు ఆరోపణలు చేసి షేర్ల ధరలను పడగొట్టడం ద్వారా హిండెన్‌బర్గ్‌ లాభాలు ఆర్జించినట్లు వెల్లడించారు. సుపరిపాలన, సమాచార వెల్లడిలో గ్రూప్‌ పటిష్ట విధానాలు అనుసరిస్తున్నట్లు వివరించారు. అన్ని రకాల నిబంధనల అమలుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు