అదానీ చేతికి ముంబై ఎయిర్‌పోర్ట్‌?

24 Aug, 2020 13:56 IST|Sakshi

జీవీకే గ్రూపు వాటాను సొంతం చేసుకోనున్న అదానీ 

ఎంఐఏఎల్‌లో 74 శాతం వాటా అదానీ చేతికి

సాక్షి, ముంబై: అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) త్వరలోనే ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఐఏఎల్) లో భారీ వాటాను సొంతం చేసుకోనుంది. పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్వహణ లీజును సొంతం చేసుకున్నఅదానీ తాజాగా మియాల్ లో 74 శాతం వాటాను  దక్కించుకోనుంది. దీంతో దేశంలో జీఎంఆర్ గ్రూప్ తరువాత అదానీ గ్రూప్ అతిపెద్ద విమానాశ్రయాల ఆపరేటర్‌గా అవతరిస్తుంది.

ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌లో జీవీకే గ్రూప్‌నకు చెందిన 50.5 శాతం వాటాను అదానీ కొనుగోలు చేయనుంది.  ఈ మేరకు  ఈ వారాంతంలో అదానీ గ్రూప్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. అలాగే 23.5 శాతం ఇతర వాటాలను కూడా కొనుగోలు చేయనుంది. బిడ్‌వెస్ట్‌ కు చెందిన 13.5 శాతం వాటా, ఏసీఎస్ఏ 10 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. దీంతో ఎంఐఏఎల్‌లో  అదానీ వాటా 74 శాతానికి చేరుతుంది. ఇందుకోసం అదానీ గ్రూప్ దాదాపు 15 వేల కోట్ల రూపాయలను చెల్లించనుంది. తద్వారా ముంబై  అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ, బ్రాండింగ్‌ అదానీ గ్రూప్‌ చేతిలోనే ఉండనుంది.

కాగా 50 సంవత్సరాల లీజుకు ఆరు విమానాశ్రయాలను అదానీకి అప్పగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని సంస్థ అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలను తన ఆధీనంలోకి తీసుకుంటుంది. అదానీ గ్రూప్ ఈ 6 విమానాశ్రయాలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య రీతిలో నిర్వహించడానికి, అభివృద్ధికి హక్కులను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు