ఈ-కామర్స్‌కు భారత్‌ ‘అమెజాన్‌’: ఇక్కడి మార్కెట్లో భారీ అవకాశాలు 

2 Sep, 2023 09:36 IST|Sakshi

 భారీ అవకాశాలు కంట్రీ మేనేజర్‌ మనీష్‌ తివారీ  

న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ రంగంలో భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని అమెజాన్‌ ఇండియా వెల్లడించింది. డిజిటైజేషన్, ఆర్థిక వృద్ధి, మొబైల్, ఇంటర్నెట్‌ విస్తృతి, యువత కారణంగా ఊపందుకున్న భారత ఈ-కామర్స్‌ ఆకర్షణీయంగా ఉందని అమెజాన్‌ ఇండియా కంజ్యూమర్‌ బిజినెస్‌ కంట్రీ మేనేజర్‌ మనీష్‌ తివారీ తెలిపారు. ఇక్కడ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి కాలపరిమితి అంశంలో చాలా స్పష్టత ఉందన్నారు. కంపెనీ తన 2025 లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఉందని చెప్పారు. అమెజాన్‌ ఇటీవలే భారత్‌లో పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. సంస్థకు ఇక్కడి మార్కెట్లో 10 కోట్ల పైచిలుకు వినియోగదార్లు ఉన్నారు. ఈ–కామర్స్‌ విస్తృతి ఇప్పటికీ పరిమితమని, దేశంలో ఈ రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయని వివరించారు. మరో పదేళ్ల వరకు ఈ-కామర్స్‌ రంగంలో విస్తరణకు ఎటువంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు.  

ఉత్తేజకర మార్కెట్‌గా..: ప్రపంచవ్యాప్తంగా సంస్థకు చాలా ఉత్తేజకర మార్కెట్‌గా భారత్‌ కొనసాగుతోందని మనీష్‌ తెలిపారు. కాబట్టి అంతర్జాతీయంగా ఇక్కడి విపణిపై అమెజాన్‌ దృష్టి కేంద్రీకరించిందని అన్నారు. ‘భారత మార్కెట్‌ చాలా ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇంతటి వ్యాపార అవకాశాలున్న మార్కెట్లు ఎక్కువగా లేవు. ఈ-కామర్స్‌ విస్తృతి తక్కువగా ఉండడంతో పోటీ విషయంలో ఎటువంటి ఆందోళన లేదు. విస్తృతి 90 శాతానికి చేరినప్పుడు పోటీ గురించి ఆందోళన చెందాలి. కస్టమర్‌ అంచనాలను ఎలా అందుకోవాలో తొలి 10 ఏళ్లు మాకు నేర్పించాయి. మార్కెట్‌ చాలా నూతనంగా ఉంది. మరిన్ని ఆవిష్కరణలు, మరిన్ని కంపెనీలు రంగ ప్రవేశం చేస్తాయి. దీర్ఘకాలంలో మా అమ్మకందారులకు, కస్టమర్లకు ఇది మంచిదని భావిస్తున్నాను’ అని అన్నారు. భారత ఈ-కామర్స్‌ మార్కెట్‌ 2022లో 83 బిలియన్‌ డాలర్లు నమోదైంది. 2026 నాటికి ఇది 150 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఎఫ్‌ఐఎస్‌ 2023 గ్లోబల్‌ పేమెంట్స్‌ నివేదిక  వెల్లడించింది.

మరిన్ని వార్తలు