ఎన్‌ఎఫ్‌టీ అమ్మకాల్లో అమితాబ్ బచ్చన్ రికార్డు!

5 Nov, 2021 21:03 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ కరెన్సీ వాడకం జోరు మీద ఉంది. పలు దేశాలు ప్రజలు డిజిటల్‌ కరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్‌, ఈథిరియం, డోగ్‌ కాయిన్‌ వంటివి అత్యంత ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరో డిజిటల్‌ టోకెన్‌ అందరినీ ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి సమానంగా నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్స్‌(ఎన్‌ఎఫ్‌టీ)పై కూడా ఆసక్తి పెరుగుతుంది. ఎన్‌ఎఫ్‌టీ(నాన్-ఫంగిబుల్ టోకెన్లు) బిజినెస్ లోకి చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు చేరుతున్నారు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కొద్ది రోజుల క్రితమే వారి నాన్‌ ఫంగిబుల్‌ టోకెన్‌ను కూడా ప్రారంభించారు. 

సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ప్రారంభించిన బియాండ్ లైఫ్ ఎన్‌ఎఫ్‌టీ రికార్డులు సృష్టించింది. అమితాబ్‌ బచ్చన్‌ ఎన్‌ఎఫ్‌టీ అమ్మకాల ద్వారా దాదాపు మిలియన్ డాలర్లు సంపాదించారు. దీని విలువ సుమారు రూ.7.17 కోట్లు. సూపర్ స్టార్ స్వంత స్వరంలో రికార్డ్ చేసిన అమితాబ్‌ బచ్చన్‌ తండ్రి ప్రసిద్ధ కవిత $756,000(రూ.5.5 కోట్లు)కు విక్రయించారు. షోలే చిత్రాల గల పోస్టర్లు $94,000కు అమ్ముడయ్యాయి. దేశంలో ‎ఎన్‌ఎఫ్‌టీ అమ్మకాల ద్వారా ఈ స్థాయిలో సంపాదించి బచ్చన్‌ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా బచ్చన్ మాట్లాడుతూ.. "డిజిటైజేషన్ ప్రపంచంలో ఎన్‌ఎఫ్‌టీలు నా అభిమానులతో ఇంతకు ముందు కంటే ఎక్కువ దగ్గర కావడానికి కొత్త అవకాశాలను తెరిచాయి. ఇది నిజంగా నాకు చాలా గర్వించదగ్గ క్షణం" అని అన్నారు.

ఎన్‌ఎఫ్‌టీ అంటే..
ఎన్‌ఎఫ్‌టీ అంటే డిజిటల్‌ ఆస్తులు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలను సైతం డిజిటల్‌ ఫార్మాట్‌లోకి మార్చి బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్‌ వర్క్‌ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఈ డిజిటల్‌ ఎస్సెట్స్‌, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వాటిని వారు తిరిగి  వేలం కూడా వేసుకోవచ్చును.

మరిన్ని వార్తలు