-

అయ్య బాబోయ్‌ ఇలా అయిపోతామా!మండే మోటివేషన్‌: ఆనంద్‌ మహీంద్ర ట్వీట్స్‌ వైరల్‌ 

28 Nov, 2022 12:06 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తరచుగా 'మండే మోటివేషన్‌' కోట్స్‌,  వీడియోలను ట్విటర్‌లో షేర్‌ చేయడం అలవాటు.  తాజాగా  మండే బ్లూస్‌ అంటూ  అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ కోట్‌ను ట్వీట్‌ చేశారు. 

"మనందరికీ పిచ్చి అని గ్రహించిన క్షణంలో మాత్రమే జీవితం పూర్తిగా అర్థమవుతుంది." అనే కోట్‌ను అభిమానులతో షేర్‌ చేశారు. ప్రపంచమే ఒక పచ్చి వలయం. అందులో మనం కూడా కొంచెం వెర్రి వాళ్లమనే సత్యాన్ని గ్రహించగలిగితే చక్కని చిరునవ్వుతో సోమవారం పనిలోకి దిగుతాం. మీరు చేసే పనిలో  'క్రేజీ గుడ్‌'గా ఉండటానికి ప్రయత్నించండి అంటూ సూచించారు.

దీంతోపాటు ఆనంద్‌ మహీంద్ర మరో ట్వీట్‌ కూడా ఆలోచనాత్మంగా మారింది.  “నర్సింగ్ హోమ్ ఇన్ ఏ పోస్ట్ టెక్ట్సింగ్ వరల్డ్” అనే టైటిల్‍తో ఉన్న ఒక కార్టూన్‌ను షేర్‌ చేశారు. వేలం వెర్రిగా పెరిగి పోతున్న స్మార్ట్ ఫోన్  వినియోగంపై  బాధాకరమైన కార్టూన్‍ను ఆయన ట్వీట్ చేశారు. ఈ కార్టూన్‌ చూస్తేనే భయంగా ఉందనీ, తనను ఇది ఫోన్‍ పక్కన పెట్టేలా చేసిందన్నారు. “ తీవ్రంగా బాధ కలిగించే కార్టూన్ ఇది. నా ఫోన్‍ను పక్కన పెట్టేలా చేసింది (ఈ ట్వీట్ చేసిన తర్వాత!). మెడను నిటారుగా ఉంచుకొని, తల ఎత్తుకొని నా ఆదివారాన్ని గడిపేలా చేసింది” అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

కాగా చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా పొద్దున్న లేచింది మొదలు, స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్‌ అయిపోతున్నారు. అలా విచక్షణ లేకుండా  నిరంతరం మొబైల్‌ను చెక్‌ చేస్తూ, దానికి బానిసలై పోతున్న వారి పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో కళ్ళకు కట్టినట్టుగా ఉంది ఈ కార్టూన్‌.  రోగులుగా మనం నర్సింగ్ హోంలో ఎలా ఉండబోతున్నామో అనడానికి పూర్తి నిదర్శనంగా నిలుస్తోంది ఈ కార్టూన్‌.

మరిన్ని వార్తలు