మార్కెట్‌: క్రూడాయిల్‌ రేట్లు పెరుగుతున్నా ఈ స్టాక్స్‌కు ఢోకాలేదు!

28 Mar, 2022 13:16 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: క్రూడాయిల్‌ రేట్లు అధిక స్థాయుల్లో ఉన్న నేపథ్యంలో దాన్ని ముడి వనరుగా ఉపయోగించే కొన్ని రంగాల సంస్థల మార్జిన్లు, లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడవచ్చని పీజీఐఎం ఇండియా మ్యుచువల్‌ ఫండ్‌ హెడ్‌ (ఈక్విటీస్‌) అనిరుద్ధ నహా తెలిపారు. ముడి చమురు అధిక ధరల వల్ల ద్రవ్యోల్బణంతో పాటు వాణిజ్య లోటు.. ద్రవ్య లోటు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రథమార్ధంలో ఈక్విటీ మార్కెట్ల విషయంలో ఆచి తూచి వ్యవహరించనున్నట్లు అనిరుద్ధ వివరించారు. ఆదాయాలపరంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం మెరుగ్గా కనిపిస్తోందని, ఇటీవల కొంత కరెక్షన్‌ తర్వాత ఐటీ స్టాక్స్‌ ఆకర్షణీయ ధరలో ఉన్నాయని ఆయన చెప్పారు. 

టెక్నాలజీ వినియోగం గణనీయంగా పెరుగుతుండటం .. ఐటీ రంగానికి తోడ్పాటునివ్వగలదని పేర్కొన్నారు. ఇక డిమాండ్‌ రికవరీ అనేది పారిశ్రామిక ఉత్పత్తుల సంస్థలకు సానుకూలమని తెలిపారు. సుదీర్ఘ మందగమనం తర్వాత రియల్‌ ఎస్టేట్‌ రంగం తిరిగి కోలుకుంటోందని, సమీప భవిష్యత్తులో ఇది నిలకడగా వృద్ధి చెందవచ్చని చెప్పారు. క్రూడాయిల్‌ ధరలు దిగి వస్తే.. రాబోయే మూడేళ్లలో కొన్ని ఆటో, ఆటో అనుబంధ కంపెనీలు సముచిత స్థాయిలో వృద్ధి చెందగలవని భావిస్తున్నట్లు అనిరుద్ధ వివరించారు. 

అయిదేళ్లు కార్పొరేట్లకు సానుకూలం.. 
రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలతో క్రూడాయిల్‌ రేట్లు భారీగా ఎగియడం వల్ల సమీప భవిష్యత్తులో కాస్త సవాళ్లు నెలకొనవచ్చని అనిరుద్ధ చెప్పారు. అయితే, ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా ఇన్వెస్టర్లు ఎన్నో చూశారని.. కంపెనీల వృద్ధి, లాభదాయకత ఆధారంగా మార్కెట్లు పుంజుకుంటూనే ఉన్నాయన్నారు. ‘‘ప్రభుత్వం అమలు చేస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ), కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు వంటి వ్యవస్థాగత మార్పులు కార్పొరేట్లకు సానూకూలాంశాలు. డిమాండ్‌ పుంజుకునే కొద్దీ అమ్మకాలు, లాభాలు వృద్ధి చెంది వచ్చే మూడు నుంచి అయిదేళ్ల పాటు దేశీ కార్పొరేట్లకు మెరుగ్గా ఉండగలదు‘‘ అని ఆయన పేర్కొన్నారు.

మూడు నుంచి అయిదేళ్ల కాలవ్యవధితో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లకు ప్రస్తుతం మంచి అవకాశాలు ఉన్నాయని అనిరుద్ధ చెప్పారు. మ్యుచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి..  ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ రిస్కు సామర్థ్యాలను, రాబడుల అంచనాలను బేరీజు వేసుకుని తదనుగుణమైన వ్యూహాన్ని పాటించాలని అనిరుద్ధ సూచించారు. తగు స్థాయి రిస్కు తీసుకోగలిగి, కనీసం మూడేళ్లకు మించి ఇన్వెస్ట్‌ చేయగలిగే వారు ఫ్లెక్సిక్యాప్‌ లేదా మిడ్‌క్యాప్‌ వ్యూహాన్ని ఎంచుకోవచ్చన్నారు. మరింత దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్న వారు స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో పరిశీలించవచ్చని అనిరుద్ధ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు