ఒక్కొక్కరికి రూ.కోటిన్నర దాకా బోనస్‌!.. వలసలను అడ్డుకునేందుకు టెక్‌ దిగ్గజాల పాట్లు

29 Dec, 2021 14:59 IST|Sakshi

మెటావర్స్‌ సాంకేతికత సంగతి ఏమో గానీ.. దాని కోసం ఉద్యోగుల నియామకాలు ఇప్పటి నుంచే ఊపందుకున్నాయి. ఈ క్రమంలో టెక్‌ దిగ్గజ కంపెనీలు పోటాపోటీగా ఉద్యోగులకు గాలం వేస్తున్నాయి. మెటా కంపెనీ(ఫేస్‌బుక్‌) ఈమధ్యే భారీ వేతనాలను ఎరగా వేసి 100 మంది ఇంజినీర్లను యాపిల్‌ నుంచి నియమించుకున్న సంగతి తెలిసిందే.  కౌంటర్‌గా యాపిల్‌ కూడా దాదాపు అదే పనిలో బిజీగా ఉంది.


ఈ క్రమంలో ఇప్పుడు ఈ రెండు కంపెనీలు పోటాపోటీ ఆఫర్లతో ఉద్యోగుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా యాపిల్‌ కంపెనీ స్టాక్‌ బోనస్‌లతో ఉద్యోగులను ఎటూ వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్‌-ఆపరేషన్స్‌ గ్రూప్‌కు చెందిన ఉద్యోగులకు 50వేల డాలర్ల నుంచి లక్షా 80వేల డాలర్లు ఇస్తామని ఆఫర్‌ ప్రకటించింది(మన కరెన్సీలో 37 లక్షల రూపాయల నుంచి దాదాపు కోటిన్నర రూపాయల దాకా). ఈ రివార్డులను అందించనున్నట్లు ప్రకటించింది. 

స్టాక్‌ బోనస్‌ ఫస్ట్‌ టైం
బ్లూమరాంగ్‌ నివేదిక ప్రకారం.. యాపిల్‌ బోనస్‌లు ఇవ్వడం కొత్తేం కాదు. కానీ,  ఈ తరహా స్టాక్‌ బోనస్‌లు.. అదీ ఈ రేంజ్‌లో ఆఫర్‌ చేయడం మాత్రం ఇదే  మొదటిసారి. పర్‌ఫార్మెన్స్‌ల ఆధారంగా వీటిని అందజేయనున్నట్లు తెలిపింది. యాపిల్‌ విపరీతమైన లాభాల్లో ఉన్న విషయం తెలిసిందే. షేర్లు కిందటి ఏడాదిలో 36 శాతం పెరుగుదలను రీచ్‌ కావడంతో పాటు మార్కెట్‌క్యాప్‌ను 3 ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకుంది కూడా. 

మెటా పెంపు మంత్రం
మరోవైపు మెటా కంపెనీ ఉద్యోగులను చేజారిపోనివ్వకుండా జీతాలు పెంచుతోంది. ముఖ్యంగా ఏఐ బేస్డ్‌ అగుమెంటెడ్‌ రియాలిటీ ‘మెటావర్స్‌’ ప్రకటన తర్వాత ఈ పెంపు భారీగా ఉంటోంది.

 

యాపిల్‌లో వలసలు.. 
ఓవైపు మెటా నుంచి భారీ ఆఫర్ల కారణంగా యాపిల్‌లో ఉద్యోగులు ఆగడం లేదు. పైగా ఇతర టెక్‌ దిగ్గజాలతో పోలిస్తే.. యాపిల్‌ తన ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. వర్క్‌ఫ్రమ్‌ హోం విషయంలోనూ సడలింపులు తక్కువగా ఇస్తోంది. దీంతో అసంతృప్తికి గురవుతున్న ఉద్యోగులు.. కంపెనీని వీడుతున్నారు. ఈ తరుణంలో భారీ స్టాక్‌ ప్యాకేజీలు వాళ్లను వెళ్లకుండా అడ్డుకుంటాయేమో చూడాలి.


చదవండి: ఐఫోన్ కొనేవారికి శుభవార్త.. రూ.18 వేలు డిస్కౌంట్..!

మరిన్ని వార్తలు