పాకిస్తాన్‌ క్రికెట్‌లో మరో కీలక పరిణామం.. సల్మాన్‌ భట్‌పై వేటు

3 Dec, 2023 08:01 IST|Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్‌ సెల‌క్ష‌న్ క‌మిటీ స‌భ్యుడిగా ఎంపికైన సల్మాన్ బట్‌ను 24 గంటల తిరగక ముందే ఛీఫ్‌ సెలక్టర్‌ వాహబ్ రియాజ్ తొలిగించాడు. వహాబ్ రియాజ్ సెలక్షన్‌ ప్యానల్‌ కన్సల్టెంట్ మెంబర్‌గా సల్మాన్‌ భట్‌ను నియమించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఆ దేశమాజీ క్రికెటర్ల నుంచి సైతం తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాడిని సెల‌క్ష‌న్ క‌మిటీ సభ్యుడిగా ఎలా నియ‌మిస్తారని ప్రశ్నల వర్షం ​కురిసింది.

ఈ నేపథ్యంలోనే భట్‌ను కన్సల్టెంట్‌ పదవి నుంచి రియాజ్‌ తొలిగించాడు. "సల్మాన్‌ భట్‌ను కన్సల్టెంట్‌గా ఎంపిక చేసిన తర్వాత నాపై విమర్శల వర్షం కురిస్తోంది. సల్మాన్‌ గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. అందుకే నా నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్నాను.  నేను ఇప్పటికే సల్మాన్ బట్‌తో మాట్లాడాను. నా టీమ్‌ నుంచి అతడిని తొలిగించానని చెప్పాను. ​కొన్ని మీడియా సంస్థలు ఆసత్యాలను ప్రచారం చేస్తున్నాయి.

మేము పారదర్శకంగా జాకా అష్రఫ్ అధ్యక్షతన పని చేస్తున్నామని" విలేకురల సమావేశంలో రియాజ్‌ పేర్కొన్నాడు. కాగా 2010లో పాకిస్తాన్ క్రికెట్‌ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కుంభ‌కోణంలో స‌ల్మాన్ భ‌ట్ కూడా ఉన్నాడు. అత‌డిపై ఐదేండ్ల నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. తిరిగి అత‌డు 2016లో క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. పాకిస్తాన్ త‌ర‌ఫున 33 టెస్టులు, 78 వ‌న్డేలు, 33 టీ20లు ఆడిన భ‌ట్‌.. త‌న కెరీర్‌లో 5,209 ప‌రుగులు సాధించాడు.

మరిన్ని వార్తలు