మూడు ప్లాంట్లు స్థాపించనున్న అరబిందో

23 Jan, 2021 01:35 IST|Sakshi

పీఎల్‌ఐ స్కీం కింద కంపెనీకి అనుమతి

తయారీ కేంద్రాలకు రూ.3,039 కోట్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా క్లిష్టమైన ఔషధాల తయారీని ప్రోత్సహించే ఉత్పత్తి ఆధారిత పథకం (పీఎల్‌ఐ) కింద అరబిందో ఫార్మాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే కర్ణాటక యాంటీబయాటిక్స్, ఫార్మాస్యూటికల్స్‌కు (కేఏపీఎల్‌), కిన్వన్‌ అనే ప్రైవేటు కంపెనీకి సైతం గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. పీఎల్‌ఐ కింద ఏర్పాటు చేయనున్న ప్లాంట్లకు ఈ మూడు సంస్థలు రూ.3,761 కోట్ల పెట్టుబడి చేయనున్నాయి. అలాగే 3,827 ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

నాలుగు విభాగాల్లో..
ప్రతిపాదిత ప్లాంట్లలో 2023 ఏప్రిల్‌ 1 నుంచి వాణిజ్యపర ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాల కింద కేంద్ర ప్రభుత్వం 2020–21 నుంచి 2030–31 మధ్య పెన్సిలిన్‌–జి, 7–ఏసీఏ, ఎరిథ్రోమైసిన్‌ థియోసైనేట్, క్లావులానిక్‌ యాసిడ్‌ విభాగాల్లో రూ.6,940 కోట్లు ఖర్చు చేయనుంది. తయారీ కేంద్రాల రాకతో ఈ కీలక ముడిపదార్థాలు, యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్స్‌ దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది.  

అరబిందో ప్లాంట్లు ఇవే..
పెన్సిలిన్‌–జి, 7–అమైనోసెఫలోస్పోరానిక్‌ యాసిడ్‌ (7–ఏసీఏ) తయారీకై లైఫియస్‌ ఫార్మా ద్వారా అరబిందో ఫార్మా దరఖాస్తు చేసింది. రూ.1,392 కోట్లతో 15,000 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో పెన్సిలిన్‌–జి ప్లాంటుతోపాటు రూ.813 కోట్లతో 2,000 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో 7–ఏసీఏ యూనిట్‌ స్థాపించనున్నారు. అలాగే క్యూల్‌ ఫార్మా ద్వారా అరబిందో ఫార్మా ఎరిథ్రోమైసిన్‌ థియోసైనేట్‌ తయారీకై రూ.834 కోట్లతో 1,600 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల ఫెసిలిటీ ఏర్పాటు చేయనుంది. మూడు కేంద్రాలకు సంస్థ రూ.3,039 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు