చైనాను వెంటాడుతున్న సమస్యలు.. రహదారులు మూసివేత!

5 Nov, 2021 15:28 IST|Sakshi

చైనాను ఒక సమస్య పోతే మరొక సమస్య వెంటాడుతుంది. చైనాలో తిరిగి కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. వీటిని అరికట్టడం కోసం అక్కడ చైనా ఆంక్షలు కూడా విధిస్తుంది. ఈ సమస్య సమసిపోక ముందే ఆ దేశంలో భారీ కాలుష్యం కారణంగా బీజింగ్‌లోని రహదారులు, పాఠశాల ఆట స్థలాలను మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే, చైనా ఇటీవల విద్యుత్ తయారీ కోసం బొగ్గు ఉత్పత్తి, వినియోగాన్ని పెంచడమే. ఇటీవల తీవ్ర బొగ్గు కొరత కారణంగా.. ఆ దేశంలో భారీగా విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని అరికట్టడం కోసం బొగ్గు ఉత్పత్తి, వినియోగాన్ని ఒక్కసారిగా పెంచింది. దీంతో ఉత్తర చైనాలో దట్టమైన పొగమంచు కప్పబడి ఉంది. 

కొన్ని ప్రాంతాల్లో 200 మీటర్ల వరకు రహదారుల మీద ఎవరు నడిచేది కూడా కనిపించడం లేదు. దీంతో ఆ దేశ వాతావరణ శాఖ.. ఫిబ్రవరిలో జరగబోయే వింటర్ ఒలింపిక్స్ 2022కు ఆతిథ్యం ఇచ్చే రాజధానిలో పాఠశాలలు, శారీరక విద్యా తరగతులు, బహిరంగ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. షాంఘై, టియాన్జిన్, హార్బిన్ తో సహా ప్రధాన నగరాలకు వెళ్లే హైవేలను మూసివేశారు. బీజింగ్‌లోని యుఎస్ రాయబార కార్యాలయం వద్ద ఒక మానిటరింగ్ స్టేషన్ ద్వారా వాయు నాణ్యతను పరిశీలించగా అక్కడ వాయు కాలుష్యం సాధారణ జనాభాకు హానికలిగించే విధంగా ఉన్నట్లు తేలింది.

(చదవండి: గంగిరెద్దులకు క్యూఆర్‌ కోడ్‌.. నిర్మలా సీతారామన్‌ ఆసక్తికర వీడియో!)

డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశించిన స్థాయి కంటే 15పాయింట్లు అధికంగా అక్కడ వాయు కాలుష్యం ఉంది. శనివారం సాయంత్రం వరకు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని బీజింగ్ అధికారులు తెలిపారు. గ్రీన్ హౌస్ వాయువులను ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశం చైనా. ఆ దేశం విద్యుత్ తయారీ కోసం 60 శాతం వరకు బొగ్గు ఉత్పత్తి మీద ఆధారపడుతుంది. అక్టోబర్ మధ్యలో సగటు రోజువారీ బొగ్గు ఉత్పత్తి సెప్టెంబర్ చివరి కంటే 1.1 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉందని దేశంలోని ఉన్నత ఆర్థిక ప్రణాళిక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ బొగ్గు కేంద్రాలు ఈ వారం ప్రారంభంలో 112 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేశాయి అని ప్రభుత్వ ఏజెన్సీ తెలిపింది. కాలుష్యాన్ని అరికట్టడం కోసం సీఓపీ 26 సదస్సులో ప్రపంచ దేశాలు తీర్మానం చేస్తుంటే.. చైనా వారి నిర్ణయాలను పెడచెవిన పెడుతుంది.

మరిన్ని వార్తలు