బంగారం రుణం తీసుకునే వ్యాపారులకు భారత్ పే శుభవార్త..!

14 Mar, 2022 19:57 IST|Sakshi

ప్రముఖ మర్చంట్స్ పేమెంట్స్ ఫ్లాట్ ఫారం భారత్ పే తమ మర్చంట్ భాగస్వాములకు శుభవార్త చెప్పింది. తమ మర్చంట్ భాగస్వాములకు బంగారు రుణాలను అందించనున్నట్లు పేర్కొంది. కంపెనీ ఇంతకు ముందు అసురక్షిత రుణాల కేటగిరీలోని కొలాటరల్ ఫ్రీ రుణాలను అందజేసింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) సుహైల్ సమీర్ నేతృత్వంలోని ఈ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆమోదం గల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల(ఎన్‌బీఎఫ్‌సీ)తో చేసుకున్న భాగస్వామ్యం ఒప్పందంలో భాగంగా రూ.20 లక్షల వరకు బంగారు రుణాలను అందించనున్నట్లు తెలిపింది.

భారత్ పే కంపెనీ ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాలలో వ్యాపారులకు బంగారు రుణాలను అందిస్తున్నట్లు ప్రారంభించింది. 2022 చివరి నాటికి 20 నగరాలకు విస్తరించాలని భావిస్తుంది. 2022 చివరి నాటికి ₹500 కోట్ల రుణాలను నెలకు 0.39% వడ్డీరేటుతో అందించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ రుణ దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుందని, అసెస్ మెంట్ ప్రక్రియ పూర్తయిన 30 నిమిషాల్లోనే రుణం మంజూరు చేయనున్నట్లు భారత్ పే ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ పే యాప్‌లో సులభంగా రుణం కోసం దరఖాస్తు చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

ఎన్‌బీఎఫ్‌సీ భాగస్వామ్యంతో సంస్థ డోర్ స్టెప్, బ్రాంచ్ కలెక్షన్ సేవలు రెండింటినీ అందిస్తోంది. వ్యాపారులు ఆరు, తొమ్మిది, 12 నెలల పాటు రుణాలు తీసుకోవచ్చు. ఈజీ డైలీ ఇన్స్టాల్ మెంట్(ఈడిఐ) ద్వారా రుణాన్ని తిరిగి చెల్లించే ఆప్షన్ కూడా వారికి ఉంది. కంపెనీ త్వరలో ఈక్వేటెడ్ నెలవారీ ఇన్ స్టాల్ మెంట్(ఈఎమ్ఐ) చెల్లింపును ప్రారంభించనుంది. భారత్ పేను 2018లో షష్వత్ నక్రానీ, భావిక్ కొలదియా కలిసి స్థాపించారు. 

(చదవండి: ఎయిర్ ఇండియా నూతన చైర్మ‌న్‌గా చంద్రశేఖరన్ నియామకం..!)

మరిన్ని వార్తలు