ఈ దశాబ్దం భారత్‌దే

12 May, 2022 00:39 IST|Sakshi

వృద్ధి ఫలాలు అందరికీ అందాలి

కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తేవాలి

టాటా గ్రూపు చైర్మన్‌ చంద్రశేఖరన్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత దశాబ్దం (2030 వరకు) భారత్‌కు ఆశావహం అని, ఎన్నో అవకాశాలు రానున్నాయని టాటా గ్రూపు చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ అన్నారు. దేశ సమగ్ర అభివృద్ధికి కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే, మరింత మంది మహిళలను ఉద్యోగాల్లోకి వచ్చేలా చూడాలన్నారు.

సీఐఐ నిర్వహించిన వ్యాపార సదస్సులో ఆయన మాట్లాడారు. రానున్న దశాబ్దాల్లో 70% ప్రపంచ వృద్ధి అంతా వర్ధమాన దేశాల నుంచే ఉంటుందని చంద్రశేఖరన్‌ అంచనా వేశారు. అందులోనూ ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌ వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుందని, భారత్‌ ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.
 
సమ్మిళిత వృద్ధి..:
‘‘మనం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నాం. కానీ, ఈ వృద్ధి ఫలాలు అందరూ అనుభవించే విధంగా ఉండాలి. ధనిక, పేదల మధ్య అంతరం పెరగకుండా చూడాలి. నా వరకు ఇదే మూల సూత్రం’’అని చంద్రశేఖరన్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కనీస నాణ్యమైన జీవనాన్ని ప్రతి ఒక్కరూ పొందేలా ఉండాలన్నారు. రానున్న పదేళ్లలో కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని సూచించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి చూస్తే భారత్‌ ప్రపంచ జీడీపీలో 3% నుంచి 7%కి చేరింది.

ఈ అభివృద్ధి వల్ల  గత పదేళ్లలోనే 27 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులయ్యారు. మనం కొత్త వ్యాపారాలు, కొత్త రంగాల్లోకి అడుగు పెట్టాం. నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌గా అవతరించాం. 2022లోనే ఇప్పటి వరకు చూస్తే ప్రతీ వారం ఒక యూనికార్న్‌ ఏర్పడింది. అయినా, మనం ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంది. అది మహిళలకు ఉపాధి కల్పించే విషయంలోనూ. ఇప్పటికీ ఎంతో మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. వీరు ఆరోగ్య, విద్యా సదుపాయాలను అందుకోలేకున్నారు’’అని చంద్రశేఖరన్‌ తెలిపారు.
సమస్యలను పరిష్కరించుకోవాలి..

భారత ఆర్థిక వ్యవస్థ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. ‘‘5 లక్షల కోట్ల డాలర్లు, 8 లక్షల కోట్ల డాలర్లకు భవిష్యత్తులో చేరుకుంటాం. తలసరి ఆదాయం రెట్టింపు అవుతుంది. కానీ, ఇది సమ్మిళితంగా ఉండాలి’’ అని తెలిపారు. ఈ దశాబ్దం భారత్‌దేనని మరోసారి గుర్తు చేస్తూ ఈ క్రమంలో సమస్యలు, సవాళ్లను పరిష్కరించుకున్నప్పుడే అవకాశాలను అందిపుచ్చుకోగలమన్నారు. సమాజంలోని అంతరాలను తొలగించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.

మహిళలకు ప్రాతినిధ్యం
పని ప్రదేశాల్లో మహిళల ప్రాతినిధ్యం తగ్గిపోతున్న విషయాన్ని ఎన్‌.చంద్రశేఖరన్‌ గుర్తు చేశారు. గత దశాబ్దంలో ఇది 27 శాతం నుంచి 23 శాతానికి దిగివచ్చినట్టు చెప్పారు. అయితే, కొత్త నైపుణ్య నమూనా కారణంగా ఇది మారుతుందన్నారు. ఇంటి నుంచే పని విధానం ఇప్పుడప్పుడే పోదంటూ, అది శాశ్వతంగానూ కొనసాగదన్నారు.

మరిన్ని వార్తలు