బయోకాన్‌ లాభం డౌన్‌

16 Nov, 2022 09:33 IST|Sakshi

న్యూఢిల్లీ:హెల్త్‌కేర్‌ రంగ దిగ్గజం బయోకాన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–2) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 168 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 188 కోట్లు ఆర్జించింది. వ్యయాలు పెరగడం ప్రభావం చూపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,840 కోట్ల నుంచి రూ. 2,320 కోట్లకు ఎగసింది.

బయోసిమిలర్స్, రీసెర్చ్‌ సర్వీసులు, జనరిక్స్‌ బిజినెస్‌ ఇందుకు సహకరించాయి. అయితే మొత్తం వ్యయాలు 30 శాతం పెరిగి రూ. 2,110 కోట్లను తాకాయి. మార్పిడిరహిత డిబెంచర్ల జారీ ద్వారా 25 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,025 కోట్లు), కమర్షియల్‌ పేపర్‌(బాండ్లు) ద్వారా మరో 27.5 కోట్ల డాలర్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు బయోకాన్‌ తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో బయోకాన్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.7 శాతం నీరసించి రూ. 284 వద్ద ముగిసింది.

చదవండి: భారత్‌లో ట్విటర్‌ చాలా స్లో, మరీ దారుణం: ఎలాన్‌ మస్క్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

మరిన్ని వార్తలు