ఎల్రక్టానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ ట్రేడింగ్‌పై బీఎస్‌ఈ కసరత్తు

4 Oct, 2021 00:06 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ (ఈజీఆర్‌) ట్రేడింగ్‌ను తమ ప్లాట్‌ఫాంపై ఆవిష్కరించేందుకు అవసరమైన టెక్నాలజీతో సిద్ధంగా ఉన్నట్లు బాంబే స్టాక్‌ ఎక్సే్చంజీ (బీఎస్‌ఈ)చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ సమీర్‌ పాటిల్‌ తెలిపారు. త్వరలో దీనికి అనుమతులు పొందేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పసిడి ధరలు దాదాపు ఒకే రకంగా ఉండేలా చూసేందుకు ఈజీఆర్‌లు తోడ్పడగలవని పాటిల్‌ చెప్పారు.

ఇతర షేర్ల లావాదేవీల తరహాలోనే ఈజీఆర్‌ల ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్‌ విధానాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈజీఆర్‌లను డీమ్యాట్‌ తరహాలోనే ఉంచుకోవచ్చని, అవసరమైనప్పుడు భౌతిక బంగారం రూపంలోకి మార్చుకోవచ్చని పాటిల్‌ చెప్పారు. ఇదంతా మూడు అంచెల్లో జరుగుతుందన్నారు. ముందుగా భౌతిక బంగారాన్ని ఈజీఆర్‌ల్లోకి మార్చడం, ఈజీఆర్‌ రూపంలో ట్రేడింగ్‌ నిర్వహించడం, తర్వాత ఈజీఆర్‌ను తిరిగి భౌతతిక రూపంలోకి మార్చడం ఉంటుందని పాటిల్‌ చెప్పారు. ముందుగా 1 కేజీ, 100 గ్రాముల డినామినేషన్‌లో ఈజీఆర్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రిటైల్‌ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు దశలవారీగా 5 గ్రాములు, 10 గ్రాములు, 50 గ్రాముల పరిమాణంలో కూడా ఈజీఆర్‌లను అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. క్లయింట్లు కావాలనుకుంటే భౌతిక బంగారాన్ని నిర్దిష్ట డెలివరీ సెంటర్‌లో జమ చేసి ఈజీఆర్‌ను కూడా పొందవచ్చని పాటిల్‌ వివరించారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ప్రస్తుతం భౌతిక రూపంలో బంగారం ట్రేడింగ్‌కు కూడా స్పాట్‌ ఎక్సే్చంజీలు ఉన్నప్పటికీ, భారత్‌లో మాత్రం గోల్డ్‌ డెరివేటివ్స్, గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో మాత్రమే ట్రేడింగ్‌కు అనుమతి ఉంటోంది.

మరిన్ని వార్తలు