టీసీఎస్‌ కన్సార్షియంకు బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ కాంట్రాక్ట్‌

23 May, 2023 06:48 IST|Sakshi

విలువ రూ. 15,000 కోట్లు

ముంబై: ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసే కాంట్రాక్టును ఐటీ దిగ్గజం టీసీఎస్‌ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌) సారథ్యంలోని కన్సార్షియం దక్కించుకుంది. దీని విలువ రూ. 15,000 కోట్లు. దీనికి సంబంధించి బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి అడ్వాన్స్‌ పర్చేజ్‌ ఆర్డర్‌ను అందుకున్నట్లు టీసీఎస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో కొద్ది నెలలుగా దీనిపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. 

బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ నెట్‌వర్క్‌ కాంట్రాక్టు గురించి ప్రకటించినప్పటి నుంచి టీసీఎస్‌ కంపెనీయే ముందు వరుసలో ఉందంటూ వార్తలు వచ్చాయి. ముంబై, న్యూఢిల్లీ మినహా బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశవ్యాప్తంగా ఫిక్స్‌డ్‌ లైన్, వైర్‌లెస్, డేటా సర్వీసులను అందిస్తోంది. మరోవైపు టెలికం పరికరాల తయారీ సంస్థ ఐటీఐకి కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 3,889 కోట్ల విలువ చేసే ఆర్డరు ఇచ్చింది. దీని ప్రకారం 18–24 నెలల వ్యవధిలో 23,633 సైట్ల కోసం 4జీ పరికరాలను సరఫరా చేయాల్సి ఉంటుందని ఐటీఐ వివరించింది.

మరిన్ని వార్తలు