Nawgati Start Up: 20ఏళ్లకే సొంతంగా స్టార్టప్‌.. విజయపథంలో దూసుకుపోతున్న కుర్రాళ్లు

17 Nov, 2023 10:27 IST|Sakshi

బారెడు బారెడు ‘క్యూ’లు అంటే భయం లేనిది ఎవరికి?ఎందుకంటే బోలెడు టైమ్‌ వృథా అవుతుంది. అసహనం పెట్రోల్‌ ధరలా పెరుగుతుంది. ఫ్యూయల్‌ స్టేషన్‌ల దగ్గర పెద్ద పెద్ద ‘క్యూ’లను చూసిన, వాహనదారుల అసహనాన్ని విన్న అనుభవంతో వైభవ్‌ కౌశిక్‌ తన స్నేహితులు ఆలాప్‌ నాయర్, ఆర్యన్‌లతో కలిసి స్టార్ట్‌ చేసిన ‘నవ్గతీ’ స్టార్టప్‌ విజయపథంలో దూసుకుపోతోంది.

కొన్ని సంవత్సరాల క్రితం గ్రేటర్‌ నోయిడాకు చెందిన వైభవ్‌ కౌశిక్‌ క్యాబ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు క్యాబ్‌ ఒక ఫ్యూయల్‌ స్టేషన్‌ దగ్గర ఆగింది. అక్కడ పెద్ద క్యూ ఉంది. చాలా టైమ్‌ తరువాత బండి రోడ్డు పైకి వచ్చింది.‘ఇలా అయితే కష్టం కదా’ అని డ్రైవర్‌తో మాటలు కలిపాడు వైభవ్‌.‘ఎప్పుడూ ఇదే కష్టం. టైమ్‌ వృథా అవుతుంది. బేరాలు పోతున్నాయి’ అసంతృప్తిగా అన్నాడు డ్రైవర్‌. ‘ఈ సమస్యకు పరిష్కారం లేదా’ అని ఆలోచించడం మొదలు పెట్టాడు వైభవ్‌. కొద్దిసేపటి తరువాత అతనిలో ఒక ఐడియా మెరిసింది. అదే నవ్గతీ. తన కాలేజీ ఫ్రెండ్స్‌ ఆలాప్‌ నాయర్, ఆర్యన్‌లతో కలిసి వైభవ్‌ కౌశిక్‌ స్టార్ట్‌ చేసిన నవ్గతీ (మార్గదర్శనం) స్టార్టప్‌ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది.


ఇంధన స్టేషన్‌ల దగ్గర రద్దీ వల్ల వాహనదారుల టైమ్‌ వృథా కాకుండా, ప్రత్యామ్నాయ నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వన్‌–స్టాప్‌ ఫ్యూయల్‌ అగ్రిగేటర్‌ ΄ప్లాట్‌ఫామ్‌ రియల్‌–టైమ్‌ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. రెండు సంవత్సరాల క్రితం దిల్లీలోని ఇంద్రప్రస్థ గ్యాస్‌స్టేషన్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌  నిర్వహించారు. డాటా–బ్యాక్‌డ్‌ ప్లాట్‌ఫామ్‌ ఆవెగ్, ఫ్యూయలింగ్‌ యాప్‌ అనే రెండు సర్వీసులను ఆఫర్‌ చేస్తోంది నవ్గతీ. బీ2సీ ఫ్యూయల్‌ డిస్కవరీ యాప్‌ ఫ్యూయల్‌ రేటు, అందుబాటు, సర్వ్‌ టైమ్‌...మొదలైన సమాచారాన్ని అందిస్తుంది. ఫ్యూయల్‌  స్టేషన్‌కు సంబంధించి రివ్యూకు అవకాశం కల్పిస్తుంది.

ఇక ‘ఆవేగ్‌’ ద్వారా ఫ్యూయల్‌ స్టేషన్‌లకు సంబంధించి రవాణా సమయం, వెయిటింగ్‌ టైమ్, సర్వింగ్‌ టైమ్, వనరుల వినియోగం తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా... సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఫ్యూయల్‌  స్టేషన్‌లు తమ సర్వీసులను మెరుగుపరుచుకోవడానికి వీలవుతుంది. ‘గతంలో ఫ్యూయల్‌ స్టేషన్‌లు కాంప్లయెన్స్‌ డిటైల్స్, లావాదేవీలు, అటెండెన్స్‌... వాటికి సంబంధించి డే–టు–డే డాటాను మాన్యువల్‌గా రికార్డ్‌ చేసేవి. ఇప్పుడు మాత్రం ‘ఆవేగ్‌’ రూపంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని యాక్టివిటీలను ఆటోమేట్‌ చేయవచ్చు. దీనివల్ల ఫ్యూయల్‌ స్టేషన్‌లు తమ సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు. ఖర్చులు తగ్గించుకోవచ్చు’ అంటున్నాడు వైభవ్‌ కౌశిక్‌.

ఇంద్రప్రస్థా గ్యాస్‌ లిమిటెడ్, ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌–దిల్లీ, మహానగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌–ముంబైకి సంబంధించిన 150 ఫ్యూయల్‌ స్టేషన్‌లలో ఈ స్టార్టప్‌ తమ ఎడ్జ్‌ కంట్రోలర్‌లను ఇన్‌స్టాల్‌ చేసింది. దేశంలోని పెద్ద పట్ణణాలతో పాటు చిన్న పట్టణాలలో కూడా విస్తరించే ప్రణాళికలు రూపొందించుకుంది.మొదట్లో సూపర్‌ యూజర్‌లతో ఒక వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేశారు. కొత్త ఫీచర్‌లను పరీక్షించడానికి, మెరుగు పరచడానికి ఈ గ్రూప్‌ బీటా టెస్టింగ్‌ గ్రూప్‌గా ఉపయోగపడింది. ఏకాంత ఆలోచనల్లో నుంచే కాదు చూసే సమస్యల్లో నుంచి కూడా స్టార్టప్‌ ఐడియాలు పుడతాయని, గట్టి కృషి చేస్తే సార్టప్‌ కలలు సాకారం అవుతాయని చెప్పడానికి ‘నవ్గతీ’ స్టార్టప్‌ ఒక ఉదాహరణ.

A post shared by Vaibhav Kaushik (@_vaibhavkaushik)

తెలియక పోయినా పట్టుదలతో...
ఇరవై సంవత్సరాల వయసులో మా ప్రయాణాన్ని ప్రారంభించాం. స్టార్టప్‌ ప్రపంచం ముఖ్యంగా ఫ్యూయల్‌–టెక్‌ గురించి పెద్దగా తెలియకపోయినా ఎప్పుడూ అధైర్యపడలేదు. వెనక్కి తగ్గలేదు. ఆసక్తి, పట్టుదలతో నేర్చుకున్నాం. సవాలుకు సక్సెస్‌తోనే జవాబు ఇవ్వాలనుకున్నాం. ‘ఐడియా బాగానే ఉందిగానీ వర్కవుట్‌ అవుతుందా?’ అని సందేహించిన వారికి కూడా మా సక్సెస్‌తో సమాధానం చెప్పాం.
– వైభవ్‌ కౌశిక్, కో–ఫౌండర్, సీయివో నవ్గతీ స్టార్టప్‌ 

మరిన్ని వార్తలు