ఇతర దేశాల కరెన్సీకన్నా...రూపాయి పటిష్టం!‘ ఆ ఉద్యోగులకు 100 శాతం వర్క్‌ ఫ్రం హోమ్‌’!

14 Sep, 2022 07:22 IST|Sakshi

లాస్‌ ఏంజిల్స్‌: భారత్‌ రూపాయి  ఇటీవలి సంవత్సరాలలో  ఇతర కరెన్సీల కంటే అధిక స్థిరత్వాన్ని కనబరిచినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు.  2014 ముందుతో పోలిస్తే క్షీణత సగటు రేటు తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. రూపాయి క్షీణత ద్వారా ప్రయోజనం పొందాలని ఎగుమతిదారుడు భావించకూడదని,  ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు, ప్రపంచ మార్కెట్లలో వినియోగదారుల అవసరాలను తీర్చగల సామర్థ్యం ఆధారంగా పటిష్ట స్థాయిలో వారు కార్యకలాపాలను నిర్వహించాలని మంత్రి అన్నారు. 

ఆదాయాల్లో అధికభాగం ఎగుమతుల ద్వారా (డాలర్ల రూపంలో) ఆర్జించే ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్స్‌ వంటి రంగాలు రూపాయి బలహీనత వల్ల ప్రయోజనం పొందే విషయం తెలిసిందే. ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే మంగళవారం రూపాయి మారకం విలువ 36 పైసలు బలపడి నెల గరిష్టస్థాయి రూ.79.17 వద్ద ముగిసింది. ఇక్కడ ఒక కార్యక్రమంలో మీడియాతో గోయల్‌ ఇంకా ఏమన్నారంటే...  

తగిన స్థాయిలోనే రూపాయి 
రూపాయి అటు సౌలభ్యకరమైన లేక ఇటు అసౌలభ్యకరమై స్థాయిలో ఉందని నేను అనుకోను. రూపాయి తన సహజ స్థానాన్ని కనుగొంటోంది. ఇది అనేక అంశాలపై ఆదారపడి ఉంటుంది. ద్రవ్యోల్బణం, మూలధన ప్రవాహం, ప్రతి దేశంలో రిస్క్‌–రివార్డ్‌ నిష్పత్తి వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ఇటీవలి సంవత్సరాలలో చాలా దేశాల కరెన్సీల కంటే భారత రూపాయి మరింత సుస్థిరతను కనబరుస్తోంది. ఇది హర్షణీయం. ఒకవైపు దిగుమతులకు అవరోధం కాకుండా, మరోవైపు ఎగుమతులకు పోటీపూర్వకంగా  రూపాయి ఈ స్థాయిలో ఉండాలన్న అంశాలన్ని పరిశీలిస్తే,   (దిగుమతుల ఆధారపడే చమురు, రిఫైనరీ సంబంధిత రంగాలకు రూపాయి బలహీనత భారం అవుతుంది. రూపాయి బలంగా ఉంటే ఆయా కంపెనీలు తక్కువ డాలర్లు వెచ్చించి... తమకు అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోగలుగుతాయి. లేదంటే తమ దిగుమతులకు ఎక్కువ డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది) ప్రస్తుతం మన కరెన్సీ తగిన స్థాయిలోనే ఉందని భావించాలి. 2014 ముందు వార్షికంగా సగటు రూపాయి క్షీణత 3.25–3.5 శాతం మధ్య ఉంది. ప్రస్తుతం 2.5 శాతం వద్దే ఉంది. రూపాయి పటిష్టత మెరుగుదలలో ఇది కీలకమైన అంశం.  

ఈయూతో ఎఫ్‌టీఏ చర్చలు 
జెనరలైజ్డ్‌ టారిఫ్‌ ప్రిఫరెన్స్‌ స్కీమ్‌ (జీఎస్‌పీ) కింద ఎగుమతి ప్రయోజనాలను ఉపసంహరించుకునే  ప్రణాళికలో యూరోపియన్‌ యూనియన్‌  (ఈయూ) ఉందన్న వార్తల గురించి అడిగినప్పుడు, గోయల్‌ సమాధానం చెబుతూ, భారత్‌ ఎగుమతిదారులు తమ స్వశక్తిప్రాతిపదికన ప్రపంచ సరఫరాల చైన్‌కు సేవలు అందించగలుగుతాయన్న ధీమాను వ్యక్తం చేశారు. యూరోపియన్‌ యూనియన్‌ జీఎస్‌పీ ప్రయోజనాలను తొలగించిన తర్వాత 2023 జనవరి నుండి ఈయూకు ఎగుమతి చేసే దాదాపు 8  బిలియన్‌ డాలర్ల విలువైన ప్లాస్టిక్,  యంత్రాలు, మెకానికల్‌ ఉపకరణాలు వంటి రంగాల నుంచి భారత్‌ ఎగుమతులపై తక్కువ లేదా జీరో–డ్యూటీ రాయితీలు నిలిచిపోతాయన్న అందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై గోయల్‌ మాట్లాడుతూ, ‘‘యూరోపియన్‌ యూనియన్‌తో భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద (ఎఫ్‌టీఏ) చర్చలు చేపడుతోంది. ఆ చర్చలపై దృష్టి సారిస్తాం. ఏ సందర్భంలోనైనా వాణిజాన్ని విస్తరించడానికి జీఎస్‌పీ అవసరమని నేను అనుకోను. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్యం మంచిదే. అయితే ఈయూతో మనకు  జీఎస్‌పీ లేనంతమాత్రాన దేశం నుంచి ఎగుమతులు నష్టపోతాయన్న భావన సరికాదు’’ అని అన్నారు.  

సెజ్‌లో 100 శాతం వర్క్‌ ఫ్రం హోమ్‌
ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌) యూనిట్లలోని ఉద్యోగులు.. 100 శాతం వర్క్‌ ఫ్రం హోమ్‌ (డబ్ల్యూఎఫ్‌హెచ్‌) విధానంలో పని చేసేందుకు అనుమతించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు గోయల్‌ తెలిపారు. ప్రస్తుతం సెజ్‌ యూనిట్లలోని మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 50 శాతం మందికి గరిష్టంగా ఏడాది పాటు డబ్ల్యూఎఫ్‌హెచ్‌ ఇచ్చే వెసులుబాటు ఉంది.   

అమెరికాతో పటిష్ట వాణిజ్యం 
అమెరికాతో వాణిజ్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడంపై గోయల్‌ మాట్లాడుతూ, ఆ దేశ మార్కెట్‌ పరిమాణం, స్థాయిని బట్టి అమెరికాలోని ప్రతి రంగం భారత్‌ వ్యాపారాలకు అవకాశం ఇస్తోందని తెలిపారు.  అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికాది కీలకపాత్ర అని పేర్కొంటూ, వారు సాంకేతికత భారీ విస్తరణకు ప్రాధాన్యత ఇస్తుండడం వాస్తవమన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు ఇక్కడ ‘ఆకాశమే హద్దు‘ అని అన్నారు. అమెరికాతో ప్రస్తుతం 159 బిలియన్‌ డాలర్లు ఉన్న భారత్‌ వాణిజ్యాన్ని రాబోయే ఆరు నుండి ఎనిమిది సంవత్సరాలలో 500 బిలియన్‌ డాలర్లకు పెంచడం లక్ష్యమని తెలిపారు.  పెరుగుతున్న భారత్‌ వాణిజ్య లోటును తగ్గించడానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) ఎలా దోహదపడతాయని అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, ప్రతి ఒడంబడికా భారత్‌ తన భాగస్వామ్య దేశాలన్నింటితో వాణిజ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. దీర్ఘకాలంలో ఇది వాణిజ్యలోటు తగ్గుదలకు దోహపడే అంశమని వివరించారు. 

‘‘వాస్తవానికి, ఎగుమతులు పెరుగుతాయి. దిగుమతుల్లో కూడా కొంత వృద్ధి ఉండవచ్చు. అంతిమంగా, ఆర్థిక కార్యకలాపాలు రెండు విధాలుగా వృద్ధి చెందుతాయి. నేను అంతర్జాతీయ వాణిజ్యాన్ని మొత్తంగా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాను. భారత్‌ ఎగుమతులపై మాకు ఎంతో విశ్వాసం ఉంది. 2030 నాటికి, భారత్‌  ట్రిలియన్‌ డాలర్ల వస్తువుల ఎగుమతిని, ట్రిలియన్‌ డాలర్ల సేవల ఎగుమతులను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించలమన్న విశ్వాసమూ ఉంది’’ అని గోయెల్‌ ఈ సందర్భంగా అన్నారు.

మరిన్ని వార్తలు