బ్యాం‘కింగ్‌’ నుంచి రూ.48,000 కోట్ల డివిడెండ్‌

2 Feb, 2023 09:08 IST|Sakshi

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థల నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.48,000 కోట్ల డివిడెండ్‌ను అంచనా వేస్తున్నట్లు బడ్జెట్‌ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) ఈ తరహా రాబడి బడ్జెట్‌ లక్ష్యం రూ.73,948 కోట్లుకాగా, చాలా తక్కువగా రూ.40,953 కోట్లు ఒనగూడుతుందన్నది తాజా అంచనా. ఈ లెక్కన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంకన్నా వచ్చే ఆర్థిక సంవత్సరం డివిడెంట్‌ దాదాపు 17 శాతం అధికం. 2022 మేలో జరిగిన బోర్డ్‌ సమావేశంలో ప్రభుత్వానికి రూ.30,307 కోట్ల డివిడెండ్‌ పేమెంట్లను చెల్లించడానికి ఆర్‌బీఐ ఆమోదముద్ర వేసింది.  
ప్రభుత్వ రంగ సంస్థల నుంచి

రూ.43,000 కోట్లు.. 
బడ్జెట్‌ డాక్యుమెంట్‌ ప్రకారం, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ఇన్వెస్ట్‌మెంట్ల నుంచి 2023–24 సంవత్సరంలో రూ.43,000 కోట్ల డివిడెండ్లు రానున్నాయి. 2022–23 సవరిత అంచనాల ప్రకారం, రూ. 43,000 కోట్లు ఒనగూరుతున్నాయి. 2022–23 బ డ్జెట్‌ అంచనా రూ.40,000 కోట్లకన్నా ఇది అధికం.  

మొత్తం డివిడెండ్‌ ఇలా... 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) సవరిత అంచనా (ఆర్‌ఈ) ప్రకారం, మొత్తంగా రూ.1,08,592 కోట్ల డివిడెండ్‌ ఒనగూరనుంది. రానున్న 2023–24లో ఈ వసూళ్లు రూ.1,15,820 కోట్లకు చేరనున్నాయి.  

బ్యాంకింగ్‌ చట్టాలకు సవరణలు 
ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, బ్యాంకుల నిర్వహణను మెరుగుపర్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంకింగ్‌ రెగ్యులేషన్, బ్యాంకింగ్‌ కంపెనీస్, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టాల్లో నిర్దిష్ట సవరణలను ప్రతిపాదించారు. మరిన్ని వినూత్న ఫిన్‌టెక్‌ సేవలను అందించేందుకు డిజిలాకర్‌లో ఉండే పత్రాల వినియోగ పరిధిని పెంచనున్నట్లు ఆమె తెలిపారు.

చదవండి: Union Budget 2023-24: కొత్త ఇన్‌కం టాక్స్‌ ప్రశ్నలేంటీ? సమాధానాలేంటీ?

మరిన్ని వార్తలు