2.74 లక్షల కోట్లకు చేరిన ద్రవ్యలోటు 

31 Jul, 2021 04:31 IST|Sakshi

జూన్‌ నాటికి ఆదాయాలు రూ. 5.47 లక్షల కోట్లు

వ్యయాలు రూ.8.21 లక్షల కోట్లు  

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) జూన్‌ ముగిసే నాటికి రూ.2,74,245 కోట్లకు చేరింది. 2021–22లో మొత్తం రూ.15,06,812 కోట్ల ద్రవ్యలోటు (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి–జీడీపీ అంచనాల్లో ఇది 6.8 శాతం) ఉంటుందన్నది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంచనా.ఈ లెక్కన ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ముగిసే నాటికి లక్ష్యంలో 18.2 శాతానికి ద్రవ్యలోటు చేరిందన్నమాట. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది.

తాజా గణాంకాలు ఇలా... 
జూన్‌ ముగిసే నాటికి ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.5.47 లక్షల కోట్లు (బడ్జెట్‌ మొత్తం అంచనాల్లో 27.7 శాతం). ఇందులో రూ.4.12 లక్షల కోట్లు పన్ను ఆదాయాలు. రూ.1.27 లక్షల కోట్లు పన్నుయేతర ఆదాయాలు. రూ.7,402 కోట్లు నాన్‌ డెట్‌ క్యాపిటల్‌ రిసిట్స్‌. నాన్‌ డెట్‌ క్యాపిటల్‌ రిసిట్స్‌లో రూ.3,406 కోట్ల రుణ రికవరీలు, రూ.3,996 కోట్లు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లభించినవి ఉన్నాయి.  
ఇక ఇదే సమయంలో వ్యయాలు రూ.8.21 లక్షల కోట్లు (2021–22 బడ్జెట్‌లో 23.6 శాతం) వీటిలో రెవెన్యూ అకౌంట్‌ నుంచి రూ.7.10 లక్షల కోట్లు వ్యయమవగా, రూ.1.11 లక్షల కోట్లు క్యాపిటల్‌ అకౌంట్‌ నుంచి వ్యయం అయ్యాయి. రెవెన్యూ వ్యయాల్లో రూ.1.84 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులుకాగా, రూ. లక్ష కోట్లు సబ్సిడీలకు వ్యయమయ్యాయి.  
వెరసి వాణిజ్యలోటు 2.74 లక్షల కోట్లుగా ఉంది.   

మరిన్ని వార్తలు