2014 నుంచి ఎన్ని  నిధులిచ్చారో చెప్పండి.. 

31 Jul, 2021 04:17 IST|Sakshi

ఉపాధి హామీ నిధులపై కేంద్రానికి హైకోర్టు ఆదేశం 

సాక్షి, అమరావతి : ఉపాధి హామీ పథకం కింద 2014 నుంచి ఇప్పటి వరకు ఏపీకి ఎన్ని నిధులిచ్చారు? ఇంకా ఎన్ని ఇవ్వాలి? తదితర వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టును ఆశ్రయించిన వారిలో పలువురికి ఉపాధి పనుల బకాయిలు చెల్లించామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఆ డబ్బు అందిందా? లేదా? చెప్పాలని వారి తరఫు న్యాయవాదులను హైకోర్టు మరోసారి ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఉత్తర్వులిచ్చారు. తాము చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం మరోసారి విచారణ జరిగింది. ఉపాధి హామీ కింద రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలను సమర్పించాలని గత విచారణ సమయంలో ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం ఓ మెమోను కోర్టు ముందుంచింది. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి.. ఆ వివరాలు సంతృప్తికరంగా లేవంటూ పైవిధంగా ఆదేశాలిచ్చారు.    

మరిన్ని వార్తలు