బాస్మతీ బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేత  

30 Nov, 2022 12:46 IST|Sakshi

న్యూఢిల్లీ: విరిగిన బియ్యంసహా ఆర్గానిక్‌ నాన్‌-బాస్మతీ బియ్యం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం మంగళవారం ఎత్తివేసింది. ఈ ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహానికి దోహదపడే చర్య ఇది. దేశీయంగా లభ్యత పెంపు లక్ష్యంగా సెప్టెంబర్‌ తొలి రోజుల్లో బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. రిటైల్‌ మార్కెట్లలో ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయ సరఫరాలను మెరుగుపరచే లక్ష్యంతో బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై 20 శాతం సుంకాన్ని కూడా విధించింది.  

ఆర్గానిక్‌ నాన్‌-బాస్మతీ రైస్, ఆర్గానిక్‌ నాన్‌-బాస్మతీ బ్రోకెన్‌ రైస్‌ ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య బియ్యం ఎగుమతుల విలువ 5.5 బిలియన్‌ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 9.7 బిలియన్‌ డాలర్లు.  

సరైన చర్య... 
‘‘భారత్‌ ఏటా 10,000-15000 టన్నుల సేంద్రీయ బియ్యాన్ని (బాస్మతి, బాస్మతీయేతర) ఎగుమతి చేస్తుంది. గత 4–5 ఏళ్లలో ఆర్గానిక్‌ బాస్మతి, నాన్‌ బాస్మతి బియ్యం ఎగుమతులు వేగంగా వృద్ధి చెందాయి.  నిషేధం ఎత్తివేస్తూ, ప్రభుత్వం సరైన చర్య తీసుకుంది’’ అని ప్రభుత్వ ప్రకటనపై  ఆల్‌ ఇండియా రైస్‌ ఎగుమతిదారుల సంఘం మాజీ అధ్యక్షుడు విజయ్‌ సెటియా వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు