యువ వ్యాపారవేత్త కామెంట్స్‌పై ట్రోలింగ్‌.. చాయ్‌ అమ్మడానికి సైన్యం ఎందుకో?

2 Dec, 2023 17:25 IST|Sakshi

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు 'ఎన్ఆర్ నారాయణ మూర్తి' గత కొన్ని రోజులకు ముందు భారతదేశం అభివృద్ధి చెందాలంటే వారానికి 70 గంటల పని అవసరమని వెల్లడించారు.. ఈ విషయం మీద సాధారణ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రముఖ వరకు పెద్ద ఎత్తున స్పందించారు. ఇదిలా ఉండగానే ఇటీవల ఓ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేసేవారు అవసరం లేదంటూ వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఈ రోజుల్లో చాలా మంది యువత ఉద్యోగం చేయడానికంటే కూడా సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'అనుభవ్ దూబే' (Anubhav Dubey). 23 ఏళ్ల వయసులోనే స్టార్టప్ కంపెనీ ప్రారభించి కోట్లు సంపాదిస్తున్నారు.

చాయ్ సుత్తా బార్ (Chai Sutta Bar) పేరుతో ఒక చాయ్ కంపెనీ ప్రారంభించాడు, ఇది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 500 అవుట్‌లెట్‌లను కలిగి ఉంది. ఈ సంస్థ విలువ రూ. 150 కోట్లు కావడం గమనార్హం. తక్కువ వయసులోనే సక్సెస్ సాధించి ఎంతోమంది యువకులకు రోల్ మోడల్‌గా నిలిచాడు.

అనుభవ్ దూబే ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే వారి కోసం వెతకడం లేదని, ఇక్కడ సైన్యం తయారు చేస్తున్నామని, ట్వీట్ చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. దీనిపైన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆస్తులు అమ్మేయడానికి సిద్దమైన హెచ్‌సీఎల్.. ఎందుకంటే?

నిజానికి అనుభవ్ దూబే తన బృందాన్ని మోటివేట్ చేయడానికి ఇలా చెప్పినట్లు తెలుస్తోంది, అయినప్పటికీ ఇది చాలామందికి కోపాన్ని తెప్పించింది. చాయ్ అమ్మడం పెద్ద విషయం కాదని ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు చాయ్ అమ్మడానికి సైన్యం ఎందుకని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు