అంచనాలకు మించి.. భారీ లాభాల్లో ప్రభుత్వ రంగ సంస్థ!

11 Aug, 2022 13:21 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం కోల్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది.  కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం రెండు రెట్లుపైగా ఎగసి రూ. 8,834 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 3,174 కోట్లు ఆర్జించింది. 

మొత్తం ఆదాయం సైతం 39 శాతం ఎగసి రూ. 32,498 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 23,293 కోట్ల టర్నోవర్‌ ప్రకటించింది. ఇక మొత్తం వ్యయాలు రూ. 21,626 కోట్ల నుంచి రూ. 23,985 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో బొగ్గు ఉత్పత్తి 124 మిలియన్‌ టన్నుల నుంచి దాదాపు 160 ఎంటీకి పెరిగింది. దేశీ బొగ్గు ఉత్పత్తిలో కంపెనీ 80 శాతం వాటాను ఆక్రమిస్తున్న విషయం విదితమే. థర్మల్‌ విద్యుత్‌ రంగం నుంచి భారీ డిమాండ్‌ నెలకొనడంతో 15.4 కోట్ల టన్నుల బొగ్గును విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది.

మొత్తం 17.75 ఎంటీ బొగ్గును విక్రయించినట్లు తెలియజేసింది. ఇంధన సరఫరా కాంట్రాక్టుల(ఎఫ్‌ఎస్‌ఏ) మార్గంలో టన్నుకి రూ. 1,442 చొప్పున ధర లభించినట్లు పేర్కొంది. వచ్చే ఏడాది(2023–24)కల్లా బిలియన్‌ టన్నుల ఉత్పత్తిని సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది 70 కోట్ల టన్నుల ఉత్పత్తిని సాధించనున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో కోల్‌ ఇండియా షేరు ఎన్‌ఎస్‌ఈలో 2%  వృద్ధితో రూ. 220 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు